వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీం కోర్ట్ వాదనలు 

కరోనా వైరస్ మహమ్మారి దృష్ట్యా ఇక నుండి కోర్ట్ గదులలో న్యాయవాదుల ప్రమేయం లేకుండా చేదాం వైపు సుప్రీం కోర్ట్ వెడుతున్నది. ఇప్పటికే అత్యవసర కేసులను మాత్రమే చేబడుతున్న అత్యున్నత న్యాయస్థానం ఇక నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే కేసులు వినాలని నిర్ణయించింది. 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వివిధ స్థాయిలలో కొనసాగుతున్న స్వీయ దిగ్బంధనం దృష్ట్యా ఇక‌పై న్యాయ‌వాదులు నేరుగా కోర్టుకు వ‌చ్చి వాదించాల్సిన అవ‌స‌రం లేద‌ని, అత్య‌వ‌స‌ర కేసులకు సంబంధించి న్యాయ‌వాదులు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారానే త‌మ వాద‌న‌లు వినిపించాల‌ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు.

ఆ దిశలో తగు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.  న్యాయ‌వాదుల‌కు కొన్ని లింకులు ఇస్తామ‌ని, ఆ లింకుల ద్వారా వీడియో కాల్స్‌ క‌నెక్ట్ చేసుకోవ‌చ్చ‌ని సీజేఐ తెలిపారు. స్కైప్ ద్వారాగానీ, మ‌రేఇత‌ర సాధ‌నాల ద్వారాగానీ లాయ‌ర్లు త‌మ వాద‌న‌లు వినిపించ‌వ‌చ్చ‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. 

మరోవంక, కోర్టు భ‌వ‌నంలోని లాయ‌ర్ల చాంబ‌ర్లు అన్నింటిని సోమ‌వారం సాయంత్రం 5 గంట‌ల నుంచి మూసివేయాల‌ని సుప్రీం కోర్ట్  ఆదేశించింది. ఇప్ప‌టికే న్యాయ‌వాదుల ఎల‌క్ట్రానిక్ పాసుల‌ను కూడా ర‌ద్దుచేసిన సుప్రీంకోర్టు..  కోర్టులో లాయ‌ర్ల‌కు సంబంధించిన ముఖ్య‌మైన డాక్యుమెంట్లు ఏవైనా ఉంటే మంగ‌ళ‌వారం సాయంత్రానిక‌ల్లా తీసుకెళ్లాల‌ని సూచించింది.