స్వీయనిర్బంధంలో13 రాష్ట్రాలు    

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా నిన్న దేశ వ్యాప్తంగా ప్రజలంతా జనతా కర్ఫ్యూలో భాగస్వాములై, విజయవంతం చేశారు. కాగా, ఒక్క రోజుకే పరిమితం కాకుండా ఈ నెలాఖరు వరకు 13 రాష్ట్రాలు స్వీయనిర్బంధంలో ఉండనున్నాయి. ప్రాణాంతక కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశం దిగ్బంధం దిశగా సాగుతున్నది. 

లాక్‌డౌన్‌లో ఉన్న రాష్ట్రాలు:  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఢిల్లీ, నాగాలాండ్, రాజస్థాన్,చత్తీస్‌‌గఢ్‌‌.  కాగా, దేశవ్యాప్తంగా కేంద్రం  17 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించింది. హర్యానాలో 7 జిల్లాలు, ఉత్తరప్రదేశ్‌లో 15 జిల్లాలు, మధ్యప్రదేశ్‌లో 5 జిల్లాలు, పశ్చిమబెంగాల్‌లోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. 

ఒడిషాలోని 5 జిల్లాలు లాక్‌డౌన్‌లో ఉండనున్నాయి. అసోంలో మరో 3 రోజుల పాటు జనతాకర్ఫ్యూ పొడగించారు. లాక్‌డౌన్‌ అయిన రాష్ట్రాలు ఆయా జిల్లాల్లో అత్యవసర సేవలు యదావిధిగా కొనసాగుతాయి. అంతర్జాతీయ విమానాలు, ప్రజారవాణా పూర్తిగా నిషేధించారు. ప్యాసింజర్‌ రైళ్లు, మెట్రో, ఎంఎంటీఎస్‌ సర్వీసులు బంద్‌ కానున్నాయి. అత్యవసర పరిస్థితి కోసం కొన్నింటిని అందుబాటులో ఉంచనున్నారు.

 భారత్‌లో ఇప్పటివరకు కోవిద్‌-19 కారణంగా ఏడుగురు వ్యక్తులు మరణించగా, బాధితుల సంఖ్య 360కి చేరకుంది. ఇటీవలి సార్క్ సమావేశాల్లో ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనా నియంత్రణకు సభ్య దేశాలు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సందర్భంగా సార్క్ విపత్తుల నిర్వహణా కేంద్రం ఆదివారం కరోనా వైరస్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. వెబ్‌సైట్‌లో సార్క్ దేశాల్లో ఎప్పటికప్పుడు ఎంతమంది వైరస్ బారినపడ్డారో ఎప్పటికప్పుడు సమాచారం అప్‌డేట్ అవుతూ ఉంటుంది.