ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌ల్లో మృత్యుఘోష 

కరోనా మహమ్మారి ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌ దేశాల్లో విలయతాండవం చేస్తున్నది. ఇటలీలో ఇప్పటివరకు 5,476 మం ది మృత్యువాతపడ్డారు. శనివారం ఒక్కరోజే 793 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ వెలుగులోకి వచ్చాక ఒక దేశంలో ఇంతమంది మృతి చెందడం ఇదే తొలిసారి. 

ఇటలీలో జనవరి 31న తొలికేసు నమోదుకాగా, నెలలోపే వైరస్‌ దేశమంతా వ్యాపించింది.  పరిస్థితి చేయిదాటుతుండడంతో ఆలస్యంగా మేల్కొన్న సర్కారు ఈ నెల 10న దేశవ్యాప్త దిగ్బంధం ప్రకటించింది. అయినప్పటికీ గత రెండు రోజుల్లోనే దాదాపు 1,420 మంది మరణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనాకు మొదటే ముకుతాడు వేయకపోతే వచ్చే ఉపద్రవానికి ఈ దేశమే ఉదాహరణ. 

ఇటలీ, చైనా తర్వాత ఇరాన్‌లో అత్యధిక మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆ దేశంలో 1,756 మంది మరణించగా, 28,603 మంది వైరస్‌ బారినపడ్డారు. ప్రజలు సహకరించకపోతే, లక్షల మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని, ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలుతుందని ప్రభుత్వం హెచ్చరించాల్సి వచ్చింది. 

ప్రజలు ఇప్పటికైనా సహకరిస్తే, మహమ్మారి అంతమయ్యే లోపు దేశంలో 12,000 మంది మరణించవచ్చని, మరో 1,20,000 మంది వైరస్‌ బారిన పడొచ్చని పేర్కొంది. స్పెయిన్‌లో ఇప్పటివరకు 1,756 మంది మరణించారు. ఈ నెల 14న ఆ దేశంలోఎమర్జెన్సీ ప్రకటించారు. అత్యవసరాలకు తప్ప ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు.   

కాగా, కరోనా మొత్తం 184 దేశాలకు విస్తరించింది.ఆదివారం మధ్యాహ్నానికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,99,391 కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 66,907 మంది కోలుకోగా.. 12,888 మంది మరణించారు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, దక్షిణకొరియా, స్విట్జర్లాండ్‌, యూకేల్లో 5 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలో 81,054 కేసులు నమోదుకాగా.. 3,261 మంది మృతిచెందారు.