31వరకు తెలుగు రాష్ట్రాలు, ఢిల్లీ లాక్‌ డౌన్‌

జనతా కర్ఫ్యూకు లభించిన విశేష స్పందన అనంతరం ఈ నెల (మార్చి) 31 వరకు లాక్‌ డౌన్‌లో  కొనసాగిస్తున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాలు, ఢిల్లీ ముఖ్యమంత్రులు ప్రకటించారు. అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు. ప్రజా రవాణా వ్యవస్థను సహితం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. విదేశాల నుండి వచ్చినవారెవ్వరు పక్షం రోజులపాటు ఇల్లు దాటి బైటకు రావద్దని కోరారు. 

ఏ ప్రదేశంలో కూడా ఐదుగురికి మించి గుమికూడవద్దని  ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కోరారు. ఎవరి ఇండ్లకు వారు పరిమితం కావాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రజలకు నిత్యావసరవస్తువుల విషయంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిందని హామీ ఇచ్చారు. ఇంటికి కావాల్సిన పాలు, కూరగాయలు, ఇతర సరుకులు తీసుకువచ్చేందుకు..ఆ ఇంటిలోని ఒక్క వ్యక్తికి మాత్రమే బయటకు వెళ్లే అనుమతివ్వడం జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. 

తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ ప్రతీ ఇంట్లో ఒక్కొక్కరి 12 కిలోల చొప్పున నెలకు సరిపడా బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.  బియ్యంతోపాటు ఇతర సరుకుల కొనుగోలు కోసం రూ.1500 నగదు అందజేస్తమని వెల్లడించారు.  మార్చి 31వరకు తెలంగాణవ్యాప్తంగా  ప్రజా రవాణా బంద్‌ ఉంటుందని, ఆటోలు, బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు బంద్‌ ఉంటయని ప్రకటించారు. 

అత్యవసరమైతేనే ఇళ్ల నుండి బైటకు రావాలని, అప్పుడు కూడా రెండు అడుగుల దూరం ఉండేటట్లు చూసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఎక్కడ 10 మందికి మించి గుమికూడావద్దని హితవు చెప్పారు. నిత్యావసర వస్తువులను ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వృద్దులు బైటకు వెళ్లవద్దని, 10 ఏళ్ళ లోపు పిల్లలను కూడా బైటకు పంపవద్దని కోరారు. 

"నిత్యావసర షాపులు తప్ప మిగతా దుకాణాలు బంద్‌ కానున్నాయి. గోడౌన్లు, ఫ్యాక్టరీలు తక్కువ సిబ్బందితో నడపాలి. ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్ని మూసివేస్తున్నాం. నిత్యవసర షాపులు తప్ప దుకాణాలు మూసివేయాలి" అని ప్రకటించారు.  

ఉచితంగా రేషన్, ఒక కిలో పప్పు ఈ నెల 29 నాటికి, శనివారం 4న కుటుంభానికి రూ 1,000 నగదు ఇంటివద్దని ఇవ్వగలమని  తెలిపారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ 1,500 కోట్ల వ్యయం కాగలదని చెప్పారు. 

రాజధాని సరిహద్దులను మూసేస్తున్నామని, అంతర్జాతీయ విమానాలను కూడా నిషేధిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంతి అరవింద్ కేజ్రీవాల్  ప్రకటించారు. అలాగే రవాణా వ్యవస్థను కూడా నిలిపేస్తున్నామని ఒక్క ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు బస్సులకు మాత్రం పాక్షికంగా అనుమతి ఉంటుందని తెలిపారు. లాక్‌డౌన్ ఉన్నా సరే, ఆయా యాజమాన్యాలు వేతనాలను అందించాల్సిందేనని కేజ్రీవాల్ ఆదేశించారు.   

కాగా, పంజాబ్ లో కూడా  మార్చి 31 వరకు లాక్ డౌన్ చేయాలని  సీఎం అమరీందర్ సింగ్ ఇప్పటికే ఆదేశించారు.  అత్యవసర సేవలు మినహా అన్నీ మూసేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. యుపిలో 15ల్లాలు లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.