కుటుంభం సభ్యులతో బండి సంజయ్ చప్పట్లు 

సాయంత్రం 5 గంటలకు కరీంనగరులో తన ఇంటి వద్ద కుటుంబసభ్యులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చప్పట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి, పారిశుధ్య సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, మీడియాకు, ఇతర శాఖల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాని మోడీ  ఇచ్చిన ఒక్క పిలుపుతో దేశవాసులంతా జనతా కర్ఫ్యులో స్వచ్చంధంగా పాల్గొని దేశ ఐక్యతను చాటడం, కరోనా పై యుద్ధానికి సన్నద్ధమవడం స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కొనియాడారు. మోడీ జనతా కర్ఫ్యూ ఆలోచన ప్రపంచానికే స్ఫూర్తిదాయకంగా నిలిచిందని చెప్పారు. 

ఇది తప్పకుండా కరోనా గొలుసును బ్రేక్ చేయడానికి, దాని వ్యాప్తిని నిరోధించడానికి ఉపయోగపడుతుందని విశ్వాసం ప్రకటించారు. జనతా కర్ఫ్యులో ప్రజలంతా  ప్రదర్శించిన సంకల్ప బలంతో ముందుకుసాగితే కరోనాను తప్పకుండా ఎదుర్కోగలం అని భరోసా వ్యక్తం చేశారు. 

అయితే  కరోనా పై విజయం సాధించాలంటే అహర్నిశలు కృషి చేస్తున్న అధికారులకు ప్రజల నుండి సంపూర్ణ సహకారం అవసరం చెప్పారు. ప్రజలంతా తమకు తెలిసిన సమాచారాన్ని వెంటనే అధికారులకు అందించాలని కోరారు.

ఇటీవల ఇండోనేషియా నుండి కరీంనగర్ కు వచ్చిన బృందం పర్యటన, ఇతర సమాచారాన్ని కొంత మంది దాచిపెట్టడం వలన ఇతరులకు నష్టం జరిగే అవకాశం ఉందని గుర్తు చేశారు. స్వచ్చంధంగా ఆ సమాచారాన్ని అందించినట్లైతే కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వానికి ఒక వెసలుబాటు కలుగుతుందని తెలిపారు. 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సూచనలను ప్రజలను తూ చ తప్పకుండ పాటించాలని కోరారు. 60 ఏళ్ల పై బడిన వారు, 10 ఏళ్ల లోపు చిన్నారులు ఇంట్లో నుండి బయటకి రాకపోవడం మంచిదని హితవు చెప్పారు. మిగితావారు కూడా అవసరమైతే తప్ప కొన్ని రోజుల పాటు బయట ఎక్కువగా సంచరించకపోవడం మంచిదని చెప్పారు. కరోనా పై ఎవరూ ఆందోళన చెందాల్సినవసరం లేదని, సమిష్టిగా అందరం కలిసి ఈ మహమ్మారిని ఎదుర్కొందామని పిలుపిచ్చారు. .