బీజేపీలో చేరిన ఎంపీ కాంగ్రెస్ మాజీ ఎమ్యెల్యేలు

మధ్యప్రదేశ్‌లో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన 22 మంది రెబల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలో  పార్టీ కండువా కప్పుకున్నారు. వీరంతా కూడబలుక్కుని శాసనసభ సభ్యత్వానికి, కాంగ్రె్‌సకు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ సర్కారు కూలిపోయింది. 

కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవలే బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆయన మద్దతుదారులైన ఈ  22 మంది మాజీ ఎమ్మెల్యేలు నడ్డాను కలిశారు. వారిని పార్టీలోకి ఆహ్వానించినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్‌ విజయవర్గీయ తెలిపారు. 

రాజీనామాల పర్యవసానంగా  జరగబోయే ఉప ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో వీరికే బీజేపీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. కాగా, బీజేపీ త్వరలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయనున్నది. ఈ స్థానాలకు కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఉప ఎన్నికల తేదీలను ప్రకటించనున్నది.