ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి  

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’కు పిలుపు ఇచ్చిన సందర్భంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లు అక్కడే ఉండాలని ప్రధాని  నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. స్వస్థలాలకు రావడానికి రైలు, బస్సుల్లో ప్రయాణాలు చేయొద్దని సూచించారు. 

అనవసర ప్రయాణాలు మానుకోవాలని, ఇంటిపట్టునే ఉండాలని ప్రధాని  మోడీ ప్రజలకు పిలుపు నిచ్చారు.   ఆదివారం దేశమంతటా జనతా కర్ఫూ పాటిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రజలంతా బయటకు వెళ్లవద్దని, ఇళ్లకే పరిమితం కావాలని ప్రధాని సూచించారు. జనతా కర్ఫూ ఆషామాషి వ్యవహారం కానేకాదని, మనకు ఎదురైన కొత్త సవాలును ప్రజలు ఏ విధంగా ఎదుర్కొంటారనేది చాటిచెప్పే విధానం అని తెలిపారు. మనలోని స్వయం నియంత్రణకు ఈ జనతా కర్ఫూ తార్కాణంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

జనతా కర్ఫూను ప్రతి ఒక్కరూ పాటించాలి. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఫోన్ల ద్వారానో ఇతరత్రానో మరో పది మందికి దీని గురించి తెలియచేయండి, వారు ఇంటి వద్దనే ఉండేలా చూడండని ప్రధాని సలహా ఇచ్చారు. ఈ విజ్ఞప్తిని ఆయన పదేపదే చేశారు. మనం తీసుకునే జాగ్రత్త చర్యలు భయాందోళనలను సృష్టించేందుకు కాదని గుర్తుంచుకోవాలి. మీరు ఇళ్లల్లో ఉండండి అంతేకాదు, మీ నగరం, మీ పట్టణం లేదా మీ ఊరికే పరిమితం కావడం మంచిదని స్పష్టం చేశారు. 

సొంత ఊరిలో సొంత ఇంట్లో గడపటమే ఇప్పటి మార్గం అన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లడం మీకే కాకుండా ఇతరులకు కూడా ఇబ్బందిని తెచ్చిపెడుతాయని , ఇది గుర్తుంచుకోవాలని ప్రధాని కోరారు. ప్రస్తుత తరుణంలో మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం అతి పెద్ద ఫలితానికి దారితీస్తుందని తెలిపారు. గృహ వాసం గురించి ప్రభుత్వం వెలువరించిన మార్గదర్శకాలను అంతా పాటించాలని సూచించారు. సెలవులు పొందే వారు ఇళ్లకు పరిమితం కాకుండా ప్రయాణాలకు వెళ్లుతున్నట్లుగా తెలియడంతో తాము ఇప్పుడు ప్రజలంతా ఇళ్లలో ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు.

వైద్యులు, అధికారులు వెలువరించే సలహాలను పాటించడం మనకే కాకుండా ఇతరులకు మేలు చేస్తుందని హితవు చెప్పారు. మనం పాటించే క్వారంటైన్‌తోనే సర్వహిత ప్రయోజనం ఉంటుందని తెలిపారు. సాధ్యమైనంత వరకూ రైలు ప్రయాణాలను మానుకోవాలని, ఈ మేరకు ఇప్పటికే భారతీయ రైల్వే వారు కూడా రైలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

కరోనా వచ్చిన వారు మీ తోటి ప్రయాణికులు అయి ఉంటే ఇక ఈ ప్రయాణం ఆరోగ్యానికి చేటు కల్గిస్తుందని ప్రధాని చెప్పారు. కరోనా వచ్చిన వారు రైళ్లలో దూర ప్రాంతాలకు వెళ్లుతున్నట్లు తెలుస్తున్నందున ఈ ప్రయాణాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటే మంచిదని పిలుపు నిచ్చారు. తాత్కాలికంగా ప్రయాణాలు నిలిపివేసుకుంటే మనకు మనం భద్రంగా ఉండటమే కాకుండా మన ఆత్మీయులను కూడా సురక్షితంగా ఉంచినట్లు అవుతుందని ప్రధాని తెలిపారు.

సార్క్‌ దేశాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘కొవిడ్‌-19 అత్యవసర నిధి’కి విరాళాల్ని ఇచ్చిన మాల్దీవులు, భూటాన్‌, నేపాల్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కట్టడికి తమిళనాడు చేపడుతున్న చర్యలను ప్రధాని మెచ్చుకున్నారు. 

కరోనా నేపథ్యంలో అత్యవసరమైన ఔషధాలు, వైద్య సామగ్రికి కొరత ఉండకుండా.. దేశంలోనే వాటి తయారీని పెంచడానికి రూ 14వేల కోట్లను కేటాయించినట్టు మోదీ తెలిపారు. కరోనా కోసం ఆర్‌ఎన్‌ఏ డయాగ్నోస్టిక్స్‌ కిట్లను తయారు చేయాల్సిందిగా పారిశ్రామిక దిగ్గజాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.