ఏపీలో ఇంటి నుండే ప్రభుత్వ ఉద్యోగుల పని 

కరోనా వైరస్ ఉధృతం అవుతున్న దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులు సగం మంది ఇంటినుండి పనిచేసే వెసులుబాటును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. ఒకొక్క వారం ఒకొక్క బృందం చొప్పున సగం మంది మాత్రమే కార్యాలయాలకు హాజరు అయ్యే విధంగా ఆదేశాలు జారీ చేశారు. సామజిక దూరం పాటించడంలో భాగంగా ఒక వారం సగం మంది ఉద్యోగులు కార్యాలయాలకు హాజరైతే, ఆ మరుసటి వారం మిగిలిన సగం మంది మాత్రమే హాజరు అవుతారు. 

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గత రాత్రి ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జారీచేసిన ఈ ఆదేశాలలో సెక్షన్ ఆఫీసర్ మొదలు, కింది స్థాయి వరకు ఉద్యోగులు రొటేషన్ పద్దతిలో మాత్రమే కార్యాలయాలకు హాజరు కావాలని ఆమె స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ప్రతి కార్యాలయంలో ఉద్యోగులను రెండు భాగాలుగా విభజించాలని సూచించారు. 

జిల్లాలో హెచ్ఓడీలు, జిల్లా ఆఫీసులు, ఆ కింది ఆఫీసులలో ఉద్యోగులను సైతం 2 సమాన గ్రూపులుగా చేసి ఆల్టర్నేట్ వారాలు పనిచేయించాలని ఆదేశాల్లో ఆమె పేర్కొన్నారు. రిటైర్ అయి ప్రభుత్వ సలహాదారులుగా, చైర్‌పర్సన్‌లుగా, కాన్సల్టెంట్‌లుగా పనిచేస్తున్న వారు హెచ్ఓడీల అనుమతితో వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అవకాశం కల్పించారు.

50 సంవత్సరాలకు పైబడి మధుమేహం, ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు, ప్రాణాంతక వ్యాధులు ఉన్నవారు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెల్ఫ్ క్వారంటైన్ అవ్వాలని ఉత్తర్వుల్లో  ఆమె స్పష్టం చేశారు. ఇలాంటివారికి ఏప్రిల్ 4 వరకు మెడికల్ సర్టిఫికెట్ అవసరం లేకుండా కమిటెడ్ లీవ్ జారీ చేస్తామని తెలిపారు.

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రొటేషన్ పద్ధతిలో ఆఫీసుకు వచ్చేలా అవకాశం కల్పించారు. ఇలా 50 శాతం ఉద్యోగులు ఆఫీసు నుంచి మిగతా 50శాతం ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా వీక్లీ రోస్టర్ తయారు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.