రాహుల్ కు మాయావతి బిగ్ షాక్

బిజెపికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను దగ్గరకు తీసుకు రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీకి బిఎస్పి అధినేత్రి మాయావతి బిగ్ షాక్ ఇచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే కాంగ్రెస్ ను కాదని అజిత్ జోగితో పొత్తు ఏర్పరచుకున్న ఆమె తాజాగా రాజస్తాన్, మధ్యప్రదేశ్ లలో కుడా అసెంబ్లీ ఎన్నికలను ఒంటరిగానే ఎదుర్కొంటామని ప్రకటించారు.

ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే ఉండదని బీఎస్పీ అధినేత్రి మాయావతి తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ బీఎస్పీతో పొత్తుకు ప్రయత్నిస్తుంటే దిగ్విజయ్‌ వంటి నేతలు వ్యతిరేకిస్తున్నారని  ఆరోపించారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల భయం కారణంగానే దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు కాంగ్రెస్-బీఎస్‌పీ పొత్తును కోరుకోవడం లేదని ద్వజమెత్తారు. బీఎస్పీని అంతం చేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందన్న మాయావతి ఆ పార్టీలోనూ కులతత్వం పెరిగిపోతోందని విమర్శించారు.

'బీజేపీని సొంతంగానే ఓడిస్తామన్న అపోహలో వాళ్లు (కాంగ్రెస్) ఉన్నారు. అయితే ప్రజలు మాత్రం కాంగ్రెస్ తప్పిదాలు, అవినీతిని మరిచిపోలేకపోతున్నారనే వాస్తవాన్ని గ్రహించలేకున్నారు. వాళ్లు తమ తప్పులను సరిదిద్దుకునేందుకు సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది' అని మాయావతి హెచ్చరించారు.