కరోనా నేపథ్యంలో తగ్గుతున్న సబ్బుల ధరలు 

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి సబ్బుల తయారీ సంస్థలు తమ వంతు సాయం చేస్తున్నాయి. ఈ మహమ్మారి నిర్మూలనకు మందే లేకపోవడంతో వ్యక్తిగత పరిశుభ్రతే ప్రధానమైంది. తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవాలన్న ప్రభుత్వ, ఆరోగ్య నిపుణుల సూచనలతో మార్కెట్‌లో సబ్బుల గిరాకీ బాగా పెరిగిపోతున్నది. 

అయితే డిమాండ్‌ ఉన్నప్పటికీ వ్యాపార కోణంలో కాకుండా సామాజిక బాధ్యతలో భాగంగా పలు కంపెనీలు తమ సబ్బుల ధరలను తగ్గిస్తున్నాయి. అంతేగాక ఉత్పత్తినీ పెంచి సబ్బుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాయి. హెచ్‌యూఎల్‌, గోద్రెజ్‌ కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌, పతంజలి తదితర సంస్థ లు తమ సబ్బుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

మార్కెట్‌ లీడర్‌ హెచ్‌యూఎల్‌ తమ ఉత్పత్తుల ధరలను 15 శాతం వరకు తగ్గించింది. అయితే కొత్తగా తయారయ్యే వాటిపై ధరల తగ్గింపు ఉంటుందని స్పష్టం చేసింది. రాబోయే కొద్ది వారాల్లో ధరలు తగ్గిన ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తాయని హెచ్‌యూఎల్‌ చెప్పింది. 

లైఫ్‌బాయ్‌ శానిటైజర్స్‌, లైఫ్‌బాయ్‌ లిక్విడ్‌ హ్యాండ్‌వాష్‌, డొమెక్స్‌ ఫ్లోర్‌ క్లీనర్ల ధరలను హెచ్‌యూఎల్‌ కోత పెట్టగా, వీటి ఉత్పత్తిని పెంచుతున్నట్లు తెలిపింది. మరోవైపు 2 కోట్ల లైఫ్‌బాయ్‌ సబ్బులను వివిధ కరోనా ప్రభావిత ప్రాంతాల్లో హెచ్‌యూఎల్‌ పంచి పెట్టనున్నది. ఈ నిర్ణయంతో సంస్థ ఆదాయంపై రూ.100 కోట్ల మేర ప్రభావం పడుతున్నది.

పతంజలి ఆయుర్వేద్‌ తమ ఉత్పత్తుల ధరలను 12.5 శాతం మేర తగ్గించింది. అలోవెరా, పసుపు-చందనం సబ్బు రకాలపై ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలియజేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో సామాన్యుడిపై మరింత భారం పడకూడదనే స్వామీ రాందేవ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని పతంజలి అధికార ప్రతినిధి ఎస్‌కే తిజరవ్‌లా తెలిపారు. 

ఇక గోద్రెజ్‌ సంస్థ.. ముడి సరుకు ధరలు పెరిగినప్పటికీ ఆ భారాన్ని వినియోగదారులపై వేయకూడదని నిర్ణయించింది. కరోనా వైరస్‌ దృష్ట్యా ఆన్‌లైన్‌లోనూ సబ్బులు, చర్మ సంబంధ ఉత్పత్తులకు డిమాండ్‌ భారీగా పెరిగిపోతుండటం గమనార్హం. మరోవైపు వైరస్‌ నుంచి కాపాడుకునేందుకు శానిటైజర్లు, మాస్క్‌లు కొనుగోలు చేయడానికి తమ ఉద్యోగుల కోసం ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ రూ.1,000 కోట్ల సాయాన్ని ప్రకటించింది.