తెలంగాణాలో తొలి ‘లోకల్’ కరోనా పాజిటివ్ కేసు

తెలంగాణలో తొలి ప్రైమరీ కాంటాక్ట్ (లోకల్) కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారికి మాత్రమే కరోనా సోకి చికిత్స పొందుతున్నారు. కానీ తొలిసారి.. ఫారిన్ నుంచి వచ్చి కరోనా సోకిన వ్యక్తి (14వ పేషెంట్)తో సన్నిహితంగా మెలిగిన అతడి కుమారుడికి (35 ఏళ్లు) కూడా కరోనా వచ్చింది. 

ఈ తొలి ప్రైమరీ కాంటాక్ట్ కరోనా పేషెంట్‌ను గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. వీరిద్దరినీ కలిసిన వాళ్లను గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు.

శనివారం నాడు ఇద్దరికి కరోనా సోకిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 14 దుబాయ్ నుంచి వచ్చిన సికింద్రాబాద్ వాసికి (65ఏళ్లు) 18న కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో గాంధీ ఆస్పత్రిలో చేరిన అతడికి (14వ పేషెంట్) కరోనా ఉన్నట్లు వైద్యులు తేల్చారు. 

అయితే అతడి కుమారుడికి (35) కరోనా లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆస్పత్రిలో చేరాడుు. అతడికి కూడా కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అలాగే దుబాయ్ నుంచి వచ్చిన క్రూయిజ్ షిప్‌లో సిబ్బందిగా పని చేసే 33 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ అని శనివారం తెలిపింది. 

ఈ రెండు కేసులతో రాష్ట్రంలో కరోనా పేషెంట్ల సంఖ్య 21కి చేరినట్లు వెల్లడించింది. అందులో ఇప్పటికే తొలి కరోనా పేషెంట్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది.

విదేశాల నుంచి వచ్చిన వాళ్లు ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఐసోలేషన్‌లో ఉండాలని, ఇతరులతో కలవొద్దని ఆరోగ్య శాఖ సూచించింది. 14 రోజులు ఇంట్లోనే క్వారంటైన్ కావాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే 104కి ఫోన్ చేసి తెలియజేయాలని కోరింది. పరిస్థితిని బట్టి ప్రభుత్వమే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుందని పేర్కొంది.