మోడీని అవహేళన చేస్తే కఠిన చర్యలు  

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అవహేళన చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రధాని మనందరి కోసమే ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారని అంటూ సంఘీభావం వ్యక్తం చేశారు. 

రేపు సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లు కొట్టి వైద్య సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ చప్పట్లు కొట్టాలన్నారని కొందరు. అయితే ప్రధాని పిలుపును కొంతమంది సోషల్ మీడియాలో అవహేళన చేస్తూ పోస్టులు పెడుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

 ‘ఏది ఏమైనా ఆయన మన ప్రధానమంత్రి.. ఆయనను మనం గౌరవించుకోవాలి. మన మంచి కోసమే మోడీ పని చేస్తున్నారు. ఆయనను కించపరిచేలా పోస్టులు పెడితే అరెస్టులు తప్పవు’ అని హెచ్చరించారు.

 కరోనా వైరస్‌ని ఐక్యతతో ఎదుర్కొంటామని ప్రపంచానికి చాటడానికి, కష్ట సమయంలో ధైర్యంగా మన కోసం సేవలు అందిస్తున్న వైద్య, పోలీస్.. ఇతర సిబ్బందికి సంఘీభావం తెలిపేందుకు రేపు ఐదు గంటలు చప్పట్లు కొట్టాలని మోడీ పిలుపునిచ్చారని ఆయన మద్దతు తెలిపారు. తాను కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొడతానని చెప్పారు.