ఇళ్లస్థలాల పట్టాల పంపిణీ 14కు వాయిదా

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్లస్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ఏప్రిల్‌ 14 (అంబేద్కర్‌ జయంతి)కు వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించిన సంగతి తెలిసిందే. 

అయితే, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ కార్యక్రమానికి బ్రేక్‌ వేసింది. అనూహ్యంగా ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ మేరకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జరిపిన సమీక్ష సమావేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ నివారణ చర్యలు పెద్ద ఎత్తున చేపడుతున్నందున ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని వాయిదా వేయడమే మేలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఇళ్లపట్టాలు, ప్లాట్ల అభివృద్ధిపై వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు అందరినీ ఒకేసారి కాకుండా వ్యక్తిగతదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుని, వారికి స్థలాలు చూపించాలని ఆదేశించారు. 

సుమారు 27 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇస్తూ, వారి జీవితాల్లో మార్పులు తీసుకొస్తుంటే కొందరు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని, కేసులు వేసి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ప్రభుత్వం తరుపు నుండి వాదనలను బలంగా వినిపించాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమ వివరాలను, ప్లాట్ల అభివృద్ధి తీరును సవివరంగా తెలియజేయాలని సూచించారు. ప్లాట్లను ముందుగానే అలాట్‌ చేస్తూ లాటరీ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు.