కరొనతో కుదేలైన రంగాలకు ఆర్థిక ప్యాకేజీ

కరోనా కాటుతో కుదేలైన వివిధ రంగాలను ఆదుకొనేందుకు సాధ్యమైనంత త్వరలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తితో దేశంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించేందుకు ఆమె నాలుగు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.  నాలుగు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పౌరవిమానయాన, పశుసంవర్ధక, పర్యాటక, ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల) శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఈ భేటీలో వివిధ అంశాలపై చర్చించామని, ఆయా శాఖల నుంచి తమకు వచ్చిన సూచనలను క్రోడీకరిస్తున్నామని నిర్మలా సీతారామన్‌  తెలిపారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఆర్థికశాఖ శనివారం అంతర్గత సమావేశాన్ని నిర్వహించనున్నదని ఆమె చెప్పారు. 

ఆర్థిక ప్యాకేజీని ఎప్పుడు ప్రకటిస్తారని విలేకర్లు ప్రశ్నించగా.. దీనికి గడువును నిర్దేశించడం కష్టమని, సాధ్యమైనంత త్వరలో ప్యాకేజీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఇంకా ఏర్పాటుచేయలేదని, దీన్ని అత్యవసరంగా ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొనే తాము సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు.