జనతా కర్ఫ్యూతో ప్యాసింజర్ రైళ్లు రద్దు

కరోనా వైరస్ మహమ్మారిపై యుద్ధం నేపథ్యంలో ఆదివారం జనతా కర్ఫ్యూలో భారతీయ రైల్వేలు కూడా పాల్గొంటున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి అదే రోజు రాత్రి 10 గంటల వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్యాసింజర్ రైళ్ళను రద్దు చేశాయి. అయితే ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, సికింద్రాబాద్‌లలో సబర్బన్ సర్వీసులు నామమాత్రంగా నడుస్తాయి. ఈ వివరాలను భారతీయ రైల్వేలు తెలిపాయి. 

మార్చి 21/22 అర్ధరాత్రి నుంచి మార్చి22 రాత్రి 10 గంటల మధ్యలో ప్యాసింజర్ రైళ్ళు నడవబోవు. అదే రోజు ఉదయం 7 గంటలకు అప్పటికే ప్రయాణంలో ఉన్న ప్యాసింజర్ రైళ్ళు తమ గమ్యస్థానాలకు వెళ్ళేందుకు అనుమతిస్తారు. రైల్వేల నిర్ణయంతో 1,300 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆదివారం రద్దవుతాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి జాతిని ఉద్దేశించి మాట్లాడిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారిపై యుద్ధంచేయాలని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితిలో మినహా ఇతర సందర్భాల్లో ఇళ్ళ నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూను పాటించాలని కోరారు. 

భారత దేశాన్ని ఆరోగ్యవంతంగా ఉండేలా చేసేందుకు నిరంతరం పని చేస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పురపాలక సంఘాల సిబ్బంది, సాయుధ దళాలు, విమానాశ్రయాల సిబ్బంది తదితరులకు కృతజ్ఞతాపూర్వకంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు అందరూ కరతాళ ధ్వనులు చేయాలని కూడా పిలుపునిచ్చారు.