కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కరోనా నివారణపై ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెస్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెస్స్‌లో కరోనా నియంత్రణ  రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్ష చేపట్టారు. 

కరోనా నియంత్రణ చర్యలపై సీఎంలతో చర్చించారు. కరోనా కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లు కూడా పాల్గొన్నారు. 

 నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ముఖ్యమంత్రులకు సూచించారు.విదేశాల నుంచి వచ్చివారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మోదీ తెలిపారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే క్వారంటైన్‌కు తరలించాలని చెప్పారు. 

ఎండలు ఎక్కువగా వైరస్‌ వ్యాపించదని తొలుత భావించాం.. కానీ గల్ఫ్‌ దేశాల్లో ఎండలు ఎక్కువగా ఉన్న కూడా కరోనా వ్యాపించిందని తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు చెప్పారు. 

మరోవంక, కరోనా వైరస్ మహమ్మారిపై యుద్ధానికి సాయుధ దళాలు సిద్ధమయ్యాయి. క్వారంటైన్ క్యాంపుల కోసం మరో నాలుగు నగరాల్లో భారీ ఏర్పాట్లు చేశాయి. సైన్యానికి సంబంధించిన ఆసుపత్రులను నోవల్ కరోనా వైరస్ బాధితుల చికిత్సకు ఉపయోగించేందుకు అనువుగా ఉండేలా మార్చాయి. 

దాదాపు 900 నుంచి 1,000 మంది వరకు చికిత్స చేయడానికి వీలుగా ఈ ఆసుపత్రులను సిద్ధం చేశారు. జైసల్మేర్, విశాఖపట్నం, జోధ్‌పూర్, గోరఖ్‌పూర్‌లలో ఈ ఏర్పాట్లు చేశారు. అవసరమైతే అతి తక్కువ సమయంలోనే వీటి సామర్థ్యాన్ని పెంచేందుకు అవకాశం ఉందని సైన్యం చెప్పింది.