తెలంగాణలో 16 కేసులు.. కరీంనగర్ లో హైఅలర్ట్

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గురువారం మరో మూడు కొత్త కేసులు నమోదుకావడంతో ఆ సంఖ్య 16కి చేరింది. లండన్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు, దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన మరోకరికి కరోనా సోకినట్లు వైద్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే పాజిటివ్ వచ్చిన వారంతా విదేశాల నుంచి వచ్చినవారే. వీరంతా నేరుగా రాష్ట్రానికి రాలేదు. కేవలం 7 మంది మాత్రమే శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాగా, మిగతా 9 మంది ఇతర ప్రాంతాల్లో విమానాలు దిగి, రోడ్డు, ట్రైన్ మార్గాల ద్వారా రాష్ట్రానికి వచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నివసించే ఏ ఒక్కరికీ వైరస్ సోకలేదు. 
ఇలా ఉండగా, రాష్ట్రంలో ఇండోనేషియా బృందం పర్యటన కలకలం రేకేత్తిస్తుంది. ఇటీవల మతప్రచారం నిమిత్తం ఢిల్లీ నుంచి రామగుండంకి వచ్చిన 12 మంది సభ్యులు కరీంనగర్ పట్టణంలో సంచరించడంతో స్థానికులతో ఆందోళన వ్యక్తం అవుతున్నది. వీరిలో మొత్తం 8 మందికి కరోనా సోకడంతో అంతటా ఆందోళన నెలకొంది. 

ఈ బృందం ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవర్ని కలిశారు? ఎంత మందిని కలిశారు? అని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరోవంక ఈ బృందం ఎందుకు వచ్చింది వెల్లడి కావడం లేదు. వారిక్కడ నమాజ్ నేర్చుకోవడం కోసం వచ్చారనే కధనం ప్రచారంలో ఉంది. ఒక ముస్లిం దేశం నుండి ఇంత దూరం నమాజ్ నేర్చుకోవడం కోసం రావడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చినవారు ఏ పని మీద వచ్చారో విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. మత ప్రచారం కోసమే వచ్చారా..? వేరే ఏదైనా కారణం ఉందో తేల్చాలని స్పష్టం చేశారు. వారు ఎక్కడెక్కడ తిరిగారో తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎయిర్ పోర్టులో పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. రోడ్డు మార్గంలో చాలామంది విదేశీయులు రాష్ట్రానికి వస్తూనే ఉన్నారన్నారని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇప్పటికే కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలో 3 కి.మీ పరిధిలో 100 మంది వైద్య బృందాలు ప్రతి ఇంట్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్ చేస్తున్నారు. ఈ ఇండోనేషియా బృందం దాదాపు 48 గంటలు పాటు కరీంనగర్ పట్టణంలో గడపడంతో అధికారులు అప్రమత్తమైనారు. 

కలెక్టరేట్ సమీపంలో ప్రజలెవ్వరినీ బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ షాపులు, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయి కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా వీరు మదర్సాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుమారు 150 మంది స్థానికులు వచ్చినట్లు సమాచారం. వీరందరికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.