ఏపీలో మరో 2 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. రెండో పాజిటివ్‌ కేసు నమోదై 24 గంటలైనా గడవక ముందే మరో కేసు వెలుగుచూసింది. విశాఖపట్నంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే ఈ విషయాన్ని వైద్యాధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. 

అధికారికంగా నిర్ధారణ అయితే రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడుకి చేరినట్టవుతుంది. కరోనా అనుమానిత లక్షణాలతో ఇటీవల నలుగురు వ్యక్తులు విశాఖలోని ఛాతీ ఆస్పత్రిలో చేరారు. వారి నుంచి సేకరించిన నమూనాలను ల్యాబ్‌కు పంపగా.. ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు తెలిసింది. 

విశాఖకు చెందిన ఆ వ్యక్తి (50) ఇటీవల మక్కాకు వెళ్లి వారం క్రితం నగరానికి తిరిగొచ్చారు. మూడు రోజుల నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ ఛాతీ ఆస్పత్రిలో చేరారు. అలాంటి లక్షణాలతోనే విదేశాల నుంచి వచ్చిన మరో ముగ్గురు కూడా ఆస్పత్రిలో చేరారు. వారి నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపించారు. 

తొలి కేసు నెల్లూరులో నమోదు కాగా, ఆ యువకుడు పూర్తిగా కోలుకున్నాడు.  ఒంగోలుకు చెందిన  యువకుడు ఐదు రోజుల క్రితం లండన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు.. అక్కడ స్నేహితుడి ఇంట్లో నాలుగు రోజులు ఉన్నాడు. 

ఈ నెల 15న  ఒంగోలుకు చేరుకున్నాడు. 16న కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతన్ని ఒంగోలు జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డులో చేర్చి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు.