ఆర్బీఐలో ఇంటి వద్ద నుంచే పని    

దేశంలోకి కరోనా వైరస్‌ శరవేగంగా చొచ్చుకొస్తున్న నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) ఇంటి వద్ద నుంచే పని చేసేందుకు తన సిబ్బందికి అనుమతినిచ్చింది. బ్యాంకు లావాదేవీలకు భంగం వాటిల్లకుండా మెజారిటీ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేయాలని ఆదేశించింది. 

మొత్తం ఆర్బీఐ పరిదిలో సుమారు 14 వేల మంది పని చేస్తున్నారు. కేంద్ర కార్యాలయం గల ముంబైలో సుమారు నాలుగువేల మంది ఉన్నారు. నగదు మార్పిడి చేసే కరెన్సీ కౌంటర్లు, ఆర్టీజీఎస్‌ విభాగం, ప్రభుత్వ లావాదేవీల విభాగాల సిబ్బంది మాత్రం విధులకు హాజరు కావాలి. 

ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌, నలుగురు డిప్యూటీ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల ఆధీనంలోని సిబ్బంది, కమ్యూనికేషన్ల విభాగం ఉద్యోగులు కూడా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. 

కాగా, అన్ని రకాల వెంటిలేటర్లు, సర్జికల్‌/ డిస్పోజబుల్‌ మాస్క్‌లు, మాస్కులను తయారు చేసేందుకు ఉపయోగించే ముడి వస్త్రాల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

కరోనా వైరస్‌ వల్ల దేశంలో నలుగురు మృతి చెందగా, 173 మందికి వ్యాధి సోకిన నేపథ్యంలో తక్షణం వైద్య సంబంధ వస్తు సామగ్రి ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంటూ.. విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది.