యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటున్న ప్రపంచం    

కరోనా వైరస్‌ వల్ల యావత్‌ ప్రపంచం యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటున్నదని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటేరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్‌ను కార్చిచ్చులా వ్యాప్తి చెందనిస్తే, లక్షల మంది ప్రాణాలను అది హరిస్తుందని హెచ్చరించారు.

‘ఐరాస ఆవిర్భావం తర్వాత 75 ఏండ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా మనం అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం’ అని చెప్పారు. కోవిడ్‌-19 మహమ్మారిపై డిజిటల్‌ వేదికగా మీడియాతో గుటేరస్‌ మాట్లాడారు. 

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనా ప్రకారం ఈ ఏడాది చివరికల్లా 3.4 లక్షల కోట్ల డాలర్ల ఆదాయాన్ని ప్రపంచం కోల్పోతుందన్నారు. కరోనా సవాళ్లపై చర్చించేందుకు వచ్చేవారం జీ-20 సభ్య దేశాలు అత్యవసరంగా సమావేశం కావాలని నిర్ణయించడాన్ని స్వాగతించారు. 

కరోనా వైరస్‌ నేపథ్యంలో శ్రీలంకలో పార్లమెంటరీ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం వచ్చేనెల 25న శ్రీలంక పార్లమెంట్‌ ఎన్నికలు జరుగాల్సి ఉంది.

వైరస్‌ నియంత్రణ పరిస్థితులకు అనుగుణంగా ఈ నెల 25వ తేదీ తర్వాత ఎన్నికల తేదీని ప్రకటిస్తామని శ్రీలంక ఎన్నికల కమిషన్‌ అధ్యక్షుడు మహిందా దేశప్రియ చెప్పారు. రెండు వారాల క్రితం శ్రీలంకలో తొలి కరోనా కేసు నమోదైంది. 50 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించగా, 200 మందికి పైగా దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.