అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు  

కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం రద్దు చేసింది. ఈ నెల 22 నుంచి వారంపాటు 29వ తేదీ వరకు అంతర్జాతీయ విమానాలకు దేశీయంగా అనుమతిని నిలిపివేసింది. కరోనా విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 65 ఏళ్లు పైబడిన వారు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. 

ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య సిబ్బందికి మినహాయింపు ఇచ్చింది. పదేళ్లలోపు పిల్లలను ఇంటి నుంచి బయటికి రానివ్వొద్దని సూచించింది.ప్రభు త్వ, ప్రైవేటురంగంలోని ఉద్యోగులకు ఇంటినుంచే పనిచేసే వసతి కల్పించాలని సూచించింది. అత్యవసర, తప్పనిసరి విభాగాల ఉద్యోగులకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ గ్రూప్‌ బీ, సీ కేటగిరీల ఉద్యోగులు వారం విడిచి వారం విధులకు రావాలని పేర్కొంది. 

ప్రభుత్వం చేసిన అన్ని సూచనలు రాష్ట్రాలు, ప్రజలు తప్పనిసరిగా పాటించాలంది. థియేటర్లు, పార్కులు, మ్యూజియంలు మూసివేయాలంది. ప్రజలు ఎక్కువమంది ఒకచోటకు చేరకుండా దూరం పాటించాలని సూచించింది.

కాగా, రైల్వేశాఖ అన్ని రకాల టికెట్లపై రాయితీలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర ప్రయాణికులు తప్ప ఇతరులు ప్రయాణం చేయకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు. యూటీఎస్‌, పీఆర్‌ఎస్‌ టికెట్లపై పూర్తి రాయితీని తొలగిస్తున్నట్లు తెలిపింది.

పరీక్షలకు హాజరయ్యే, స్వస్థలాలకు వెళుతున్న విద్యార్థులకు, నాలుగు రకాల దివ్యాంగులకు, 11 రకాల పేషంట్లకు తప్ప మిగితా అందరికీ రాయితీ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 20-03-2020 నుంచి బుక్‌ చేసుకునే వారికి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.