కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా కఠిన చర్యలు  

కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా కఠినంగా వ్యవహరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు  స్పష్టం చేశారు. కరీంనగర్‌ ఘటనపై పోలీసులు, అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చామని ప్రకటించారు. కరీంనగర్‌లో కరోనా కలకలం వెనుక కుట్ర ఉందని, దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

తెలంగాణలో 14 మందికి కరోనా వచ్చిందని, వారంతా బయటి దేశం నుంచి వచ్చిన వారే, ఇక్కడి వాళ్లకు ఎవరికీ కరోనా రాలేదని చెబుతూ  ఆందోళన వద్దని ప్రజలకు భరోసా ఇచ్చారు. దేశంలో 166 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని చెబుతూ చైనా, ఇటలీ, ఇరాన్‌ కరోనాను నిర్లక్ష్యం చేశాయని, అట్టహాసంగా మతపరమైన వేడుకలు నిర్వహించారని పేర్కొన్నారు.  

శుక్రవారం నుంచి గ్రామపంచాయతీలు, మున్సిపల్‌ సిబ్బందితో సమాచారాన్ని సేకరిస్తామని చెప్పారు. రోడ్డు మార్గంలో వచ్చేవారిని గుర్తించడం కష్టంగా మారిందని, వారం రోజులు మూసివేస్తామన్న మాల్స్‌, బార్లు, రెస్టారెంట్లను ఈ నెల 31 వరకు మూసివేయాలని ఆదేశించామని కేసీఆర్‌ వెల్లడించాయిరు. సభలు, సమావేశాలు నిర్వహించవద్దని, బహిరంగ ప్రదేశాల్లో జనాలు గుమిగూడ వద్దని కేసీఆర్‌ సూచించారు. 

కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలతో కమిటీని వేశామని, విదేశాల నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్‌ చేయాలని కేసీఆర్‌ తెలిపారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారిపై నిఘా పెడతామని, విదేశాల నుంచి ఎవరు వచ్చినా వారిపై నియంత్రణ ఉంచాలని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

తెలంగాణకు సరిహద్దులు ఎక్కువగా ఉన్నాయని, దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కూడా మాట్లాడామని కేసీఆర్‌ పేర్కొన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామని, రాష్ట్ర వ్యాప్తంగా 18 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపా రు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను చెక్‌ చేస్తామని, జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ వ్యాపించదని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

ప్రతీ ఒక్కరూ శుచి, శుభ్రత పాటించటంతో కొన్ని ముందు జాగ్రత్తలు పాటించాలని సీఎం ప్రజలను కోరారు. ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష అని, ముందు జాగ్రత్త పాటించి మనల్ని మనం కాపాడు కుందాం.. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఆరోగ్యంగా ఉంచుదామని సీఎం విజ్ఞప్తి చేశారు.  ప్రతీ ఒక్కరు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని  ప్రజలకు పిలుపునిచ్చారు. 

దేవాలయాలు, మసీదులు, చర్చీలకు ప్రజలను అనుమతించవద్దు.  ఎక్కువ మంది గుమికూడకుండా ఉండటమే కరోనా కట్టడికి ముఖ్యసూత్రం.. జగ్‌నేకి రాత్‌ని కూడా రద్దు చేసుకుంటామని ముస్లీంలు అంగీకరించారు. ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఇప్పటికే రద్దు చేశామని చెప్పారు.