ఆదివారం దేశమంతటా జనతా కర్ఫ్యూ  

వైరస్‌ నేపథ్యంలో దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. ప్రధాని మోదీ జాతినుద్దేశించి  ప్రసంగిస్తూ..ప్రపంచ మానవాళి మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారని చెప్పారు. కోవిడ్‌-19 ప్రపంచదేశాలను వణికిస్తోందని పేర్కొంటూ రెండో ప్రపంచయుద్దం కంటే పెద్ద విపత్తును మనం ఎదుర్కొంటున్నామని హెచ్చరించారు. 

ఈ నెల 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశమంతటా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ సమయంలో ఎవరూ తమ ఇల్లు, సొసైటీ లేదా భవనం నుంచి బయటకు రావొద్దని చెప్పారు. మనల్ని మనం కాపాడుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి తప్పనిసరిగా సంయమనం పాటించాలని సూచించారు. రాబోయే కొద్ది రోజులపాటు చాలా ముఖ్యమైన పని ఉంటేనే ప్రజలు తమ ఇళ్ళ నుంచి బయటకు రావాలని తెలిపారు.

రెండు నెలలుగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రెండో ప్రపంచయుద్ధం వల్ల కూడా ఇన్ని దేశాలు ఇబ్బంది ఇపడలేదు. ప్రజలంతా వ్యక్తి  పరిశుభ్రత ఖచ్చితంగా పాటించాలని ప్రధాని మోదీ కోరారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్ని సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

కరోనాను అరికట్టేందుకు ఎలాంటి మందులు కనిపెట్టలేదు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పడే ఉపశమనం లభించే అవకాశం కనిపించడం లేదు. వచ్చే కొద్ది వారాలు మీ సమయం నాకు ఇవ్వాలని కోరుతున్నా. అందరం చేయి చేయి కలిపి కరోనా మహమ్మారిపై యుద్ధం చేయాలని కోరారు. 

ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు శాస్త్రవేత్తలు ఎలాంటి మార్గం కనిపెట్టలేకపోయారని చెబుతూ కరోనా కబలిస్తున్న దేశాల్లో మొదట బాధితుల సంఖ్య తక్కువగా ఉన్నా..రాను రాను సంఖ్య పెరిగిపోతుందని ప్రధాని తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా దేశ ప్రజలంతా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. సంకల్పం, కనీస జాగ్రత్తలు పాటిస్తే ఈ మహమ్మారిని అరికట్టవచ్చని హితవు చెప్పారు. 

ఎవరికి వారు ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉన్నట్లే.. కరోనా నివారణకు ప్రపంచదేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒంటరిగా ఉండటంతోనే ఈ మహమ్మారిని కట్టడి చేయవచ్చన్నారు. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కరోనాను ఎదుర్కొనేందుకు మన ముందున్న మార్గాలు ఒకటి దృఢ సంకల్పం, రెండోది కలిసి పనిచేయడమని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. 

వైద్యరంగం, మీడియాలో పనిచేసేవాళ్లు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రజలంతా బాధ్యతలు గుర్తించి మనకు రాకుండా ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడాలని ప్రధాని సూచనలు చేశారు. అత్యవసర విభాగాల్లో పనిచేసేవాళ్లు తగిన తీసుకోవాలి. 60-65 ఏళ్లు దాటిన వృద్ధులను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు వెళ్లనీయరాదని సూచించారు. మాకు ఏమీ కాదన్న నిర్లక్ష్యం, నీకే కాకుండా నీ కుటుంబానికి, సమాజానికి, దేశానికే నష్టమని వారించారు. 

మ‌హ‌మ్మారి వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థకు తీవ్ర ఇబ్బంది ఎదుర‌వుతోందని చెబుతూ  కోవిడ్‌19 ఎక‌నామిక్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్రధాని ప్రకటించారు.  ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు ఆ టాస్క్ ఫోర్స్ అన్ని చ‌ర్య‌లు తీసుకుంటుందని చెప్పారు. ప్ర‌జ‌లంతా బాధ్య‌తాయుతంగా ఉండాల‌ని,  కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆదేశాల‌ను పాటించాల‌ని హితవు చెప్పారు. 

కుటుంబాన్ని వ్యాధి నుంచి ర‌క్షించుకోవ‌డం సామాజిక బాధ్య‌త‌.  అవ‌స‌ర‌మైన మందులు ద‌గ్గ‌ర ఉంచుకోండని సూచించారు.  కానీ మందులు నిత్యం స‌ర‌ఫ‌రా చేస్తూనే ఉంటామ‌ని హామీ ఇస్తూ గ‌త రెండు నెల‌ల నుంచి 130 కోట్ల మంది భార‌తీయులు.. క‌రోనా సంక‌టాన్ని ఎదుర్కొన్నార‌ని పేర్కొన్నారు.