నెల రోజులపాటు ఆందోళనలు నిలిపివేసిన బిజెపి 

కరోనా వైరస్ కారణంగా దేశంలో ఓ నెల పాటు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం సూచించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలకు సూచించిన తర్వాత నడ్డా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అంతేకాకుండా ఏప్రిల్ 15 వరకు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టవద్దని కూడా ప్రధాని వారికి సూచించారు. ప్రధాని సూచించిన సూచనను దృష్టిలో పెట్టుకుని ఓ నెల పాటు ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తాము నిర్ణయం తీసుకున్నామని నడ్డా వివరించారు. 

ఇప్పటికే అన్ని రాష్ట్ర శాఖలకు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే కరోనాపై అన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర శాఖలకు అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. 

ఎక్కడైనా ఏదైనా సమస్యపై  స్పందించ వలసి వస్తే నలుగురైదుగురు మాత్రమే పార్టీ తరపున సంబంధింత అధికారులను కలసి విజ్ఞాపన పత్రాలు సమర్పించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.