పారదర్శకతతో కరోనా వైరస్ సమాచారం  

నూటికి నూరు శాతం పారదర్శకతతో కరోనా వైరస్ కేసుల సమాచారాన్ని వెల్లడిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. ఈ వైరస్‌కు సంబంధించిన పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయని, వాస్తవ కేసుల సంఖ్యను మరుగుపరుస్తున్నారని వచ్చిన ఆరోపణలను ఖండించింది. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ భారత దేశానికి సంబంధించినంత వరకు తాము నూటికి నూరు శాతం పారదర్శకంగా ఉన్నామన్నారు. తాము ప్రోటోకాల్‌ను పాటిస్తున్నామని చెప్పారు.

 ప్రజల్లో ఆందోళన రేకెత్తించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, కేవలం పరీక్షల కోసం ప్రజలను పరీక్షించాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. తాము ఒక గంటలోనే కేసుల సంఖ్యను తాజా పరిస్థితికి అనుగుణంగా సవరిస్తున్నట్లు తెలిపారు. 

మన దేశంలో పరీక్షలు చేసే సదుపాయాలు తక్కువగా ఉన్నందువల్ల నిర్థరణ అవుతున్న కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తోందని వస్తున్న ఆరోపణలను కొట్టిపారవేసారు. క్వాలిఫైడ్ ఫిజిషియన్ నిర్దేశించినపుడు మాత్రమే ల్యాబొరేటరీ టెస్టులు నిర్వహించవలసి ఉంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మార్గదర్శకాలు చెప్తున్నాయని గుర్తు చేశారు.