భారత సైన్యంలో తొలి కరోనా కేసు

భారత సైన్యంలో తొలి కరోనా వైరస్‌ కేసు నమోదైంది. జమ్ము కాశ్మీర్‌లోని లీ ప్రాంతానికి చెందిన సైనికుడికి వైరస్‌ సోకినట్టు వెల్లడైంది. బాధిత జవాను తండ్రి ఫిబ్రవరి 27న ఇరాన్‌ నుంచి లఢఖ్‌కు తిరిగి వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో జవాన్‌ తండ్రిని ఫిబ్రవరి 29 నుంచి మార్చి 6వ తేదీ వరకు లఢఖ్‌ హార్ట్‌ ఫౌండేషన్‌లోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. 

అయితే జవాన్‌ సాధారణ సెలవు మీద ఇంటికెళ్లిన సమయంలోనే ఇరాన్‌ నుంచి ఆయన తండ్రి వచ్చాడు. దీంతో జవాన్‌కు కూడా కరోనా సోకింది. మార్చి 2న తిరిగి ఆర్మీ విధుల్లో చేరాడు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న జవాన్‌కు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌ వచ్చింది. జవాన్‌తో పాటు అతని భార్య, సోదరి, ఇద్దరు పిల్లలను ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

మరోవంక, కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో విదేశీ పర్యాటకుల ప్రవేశంపై నిషేధం విధించారు. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో కశ్మీర్ లో విదేశీ పర్యాటకులు రాకుండా నిషేధం విధించామని కశ్మీర్ జిల్లా మెజిస్ట్రేట్ షాహిద్ చౌదరి ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్ లో మూడు కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వైరస్‌ వ్యాప్తిలో భారత్‌ మూడవ దశలో లేదని, రెండవ దశలో ఉందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) స్పష్టం చేసింది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించే క్రమంలో టెస్టింగ్‌ కోసం 72 పంక్షనల్‌ లేబరేటరీలు అందుబాటులో ఉన్నాయని, ఈవారాంతానికి మరో 49 ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవ తెలిపారు. 

డెడ్లీ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు విదేశీయుల ప్రవేశంపై నిషేధం సహా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ భారత్‌లో కరోనా కేసులు 147 కి పెరిగాయి. ఇక రైల్వేలు సైతం వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు 85 రైళ్లను రద్దు చేశాయి.