సుప్రీం కోర్ట్ లో జగన్ కు చుక్కెదురు!

స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆరు వారల పాటు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్ణయంను సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చుక్కెదురైంది. 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల వాయిదాను సమర్థించింది. ఎన్నికల నిర్వహణ ఎప్పుడనేది ఈసీదే నిర్ణయాధికారం అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా  ఏపీ ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చింది. 

రాష్ట్ర ప్రభుత్వ  పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ నేడు చేపట్టింది.   అయితే ఎన్నికల కోడ్‌ను తక్షణమే ఎత్తివేయాలని ఈసీకి సుప్రీంకోర్టు సూచించింది. ఓటర్లను ప్రలోభపెట్టేలా కొత్త పథకాలు ప్రవేశపెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఒకవేళ ప్రభుత్వం ఏవైనా కొత్త ప్రాజెక్టులు, పథకాలు చేపట్టాలంటే ఈసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. కాగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు కొత్త తేదీలు ప్రకటించాక 4 వారాల ముందు నుంచి కోడ్ అమల్లోకి వస్తుందని ధర్మాసనం పేర్కొంది.