ఆగస్టు వరకూ కరోనా సంక్షోభం... ట్రంప్ అంచనా 

ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ సంక్షోభం వచ్చే ఆగస్టు వరకూ కొనసాగే అవకాశం వుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంచనా వేశారు. ఈ వైరస్‌ మహమ్మారి ప్రభావాన్ని తప్పించుకునేందుకు అమెరికా ప్రజలు తమను తాము గృహనిర్బంధం చేసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

అమెరికా దేశవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్‌ కేసులు 4,500కు పైగా నమోదు కాగా, 85 మంది మృత్యువాత పడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ వైరస్‌ నానాటికీ వేగంగా విస్తరిస్తుండటంతో దీనిని అడ్డుకునేందుకు ప్రభుత్వం పర్యాటక ఆంక్షలు, స్కూళ్లు, రెస్టారెంట్లు, బార్‌ల మూసివేత, వినోద కార్యక్రమాల రద్దు వంటి చర్యలు చేపట్టింది. 

మంగళవారం ఆయన వైట్‌హౌస్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 'ఈ మంచి పని కూడా చేయలేకపోతే మనం కరోనా వైరస్‌ మరణాలను తక్కువ స్థాయికి తేలేం.. కానీ ప్రజలు మాత్రం జులై, ఆగస్టు గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయానికి కరోనా బెడద తొలగిపోతుందని భావిస్తున్నాన'ని పేర్కొన్నారు. ఇతర దేశాల అనుభవాలను గమనిస్తే కరోనా కేసుల సంఖ్య రానున్న వారాల్లో గణనీయంగా పెరిగే అవకాశం వుందని ఆయన చెప్పారు. 

ఇదిలా వుండగా కరోనా వైరస్‌ బెడద నుండి తప్పించుకునేందుకు వైట్‌హౌస్‌ అమెరికన్‌ ప్రజలకు నాడు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలు ఒకరికొకరు దూరంగా వుండాలని, సామాజిక కార్యక్రమాలు నివారించు కోవాలని, పది మంది కన్నా ఎక్కువ ఒక చోట చేరవద్దని సూచించింది. ఈ సూచనలు ప్రతి ఒక్కరూ పాటిస్తే మనం ఈ వైరస్‌ను తప్పకుండా ఓడించగలమని ట్రంప్‌ చెప్పారు. వైరస్‌ బెడద తొలగిన తరువాత మనందరం కలిసి విజయోత్సవాలు జరుపుకోవచ్చన్నారు. 

శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలోని సిలికాన్‌ వాలీ ప్రాంతాలలో వుంటున్న అరవై లక్షల మందికి పైగా ప్రజలను ఇళ్లలోనేవుండాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా హోటళ్లు, బార్‌లు, సినిమాహాళ్లు మూతపడ్డాయి. కరోనా వైరస్‌ బెడదను అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలన్నింటికీ మద్దతుగా నిలిచేందుకు తాము సిద్ధంగా వున్నామని అమెరికా రక్షణశాఖ పెంటగాన్‌ ప్రకటించింది.