ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బిజెపి మౌనదీక్ష  

తెలంగాణ అసెంబ్లీ సీఏఏ, ఎన్సార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో అంబేద్కర్‌ విగ్రహం ముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ నేతృత్వంలో బీజీపీ మౌన దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబురావు,  కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ సీఏఏ ఎవరికి వ్యతిరేకం కాదని, సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా కనువిప్పు తెచ్చుకోవాలని హితవు చెప్పారు.   పౌరసత్వ సవరణ చట్టంతో(సీఏఏ) దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. వేరే దేశం నుంచి ముస్లింలు వస్తే దేశంలో ఉన్న ముస్లింలు పొట్టకొట్టే ప్రయత్నం చేసినట్లే అవుతుందని ఆయన విమర్శించారు. 

ముస్లిం ఓట్ల కోసమే వ్యతిరేక తీర్మాణం చేశారని విమర్శించారు. కేసీఆర్‌ అయినా, ఓవైసీ అయినా జాతీయ పౌర పట్టికలో(ఎన్పీఆర్‌) నమోదు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. దేశం గురించే ఆలోచించే సమయం కేసీఆర్‌కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. 

తెలంగాణలోరైతులు, విద్యార్థులు, ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కేసీఆర్‌ పట్టించుకోలేదని, సీఏఏ, ఎన్పీఆర్‌ అమలు జరిగి తీరుతుందని తేల్చి చెప్పారు. అసెంబ్లీ చేసిన తీర్మానం చెత్తబుట్టకే పరిమితం అవుతుందని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. 

మరోవైపు ఎన్నార్సీ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు సిరిసిల్లలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.