జగన్ కు ధీటుగా రమేష్ కుమార్ జవాబు 

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన తీవ్రమైన ఆరోపణలను తిప్పికొడుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ధీటుగా సమాధానం చెప్పారు. రాష్ట్రంలో  కరోనా వైరస్ ను ప్రబలకుండా ప్రభుత్వం కట్టడి చేస్తున్న దృష్ట్యా ఎన్నికల వాయిదాను ఉపసంహరించు కోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి నీలం సహానీ వ్రాసిన లేఖకు ఘాటుగా ఇచ్చిన మూడు పేజీల సమాధానంలో జగన్ ఆరోపణలను ఎండగట్టారు. 

తాను ఎవ్వరిని సంప్రదించకుండా కరోనా వైరస్ ప్రభావం చూపానని చేసిన విమర్శను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ కార్యదర్శితో తాను తరచూ సంప్రదిస్తూ ఉన్నానని, ప్రభుత్వ ప్రధాన కారాదర్శిని కూడా సంప్రదింపమని సూచించానని స్పష్టం చేశారు. ఎన్నికల వాయిదాను కేంద్ర టాస్క్ ఫోర్స్ కు నివేదించి, ఎన్నికలు నిర్వహించవచ్చని వారు చెబితే తాను తక్షణమే ఎన్నికలు నిర్వహిస్తానని అంటూ ఒక విధంగా సవాల్ చేసే ధోరణిలో పేర్కొన్నారు. 

పైగా, తాను ఈ నిర్మాణమే తీసుకున్న తర్వాత కరోనా వైరస్ ప్రభావంతో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిసా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపేశారని గుర్తు చేశారు. 

మార్చ్ చివరిలోగా ఎన్నికలు  జరపని పక్షంలో 14వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం నుండి రావలసిన రూ 5,000 కోట్ల నిధులు కోల్పోతామని జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా తిప్పికొట్టారు.  ఎన్నికలు ఆలస్యం అయిన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పెండింగ్ నిధులు తెచ్చుకోవచ్చని సూచించారు. 

గతంలో రాజ్ భవన్‌లో కంటే ముందు ఆర్థిక శాఖలో ఫైనాన్స్ వ్యవహారాలు చూశానని, ఆర్థిక వ్యవహారాలపై తనకు పృథి అవగాహన ఉందని తేల్చి చెప్పారు. అవసరమైతే ఈ నిధులను పొందడంలో తాను రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించ గలనని భరోసా ఇచ్చారు.  

ఎన్నికలకు ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు చెప్పారు. గతంలో కూడా ఇదేవిధంగా ఎన్నికలు నిలిపివేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చిన  సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. 

కరోనా ఛాలెంజ్ ఎదుర్కుంటున్న ప్రస్తుత దశలో ఏపీ ఒంటరిగా లేదని చెబుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను, కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు.