మహారాష్ట్రలో షిర్డీ ఆలయం మూసివేత  

కరోనా వైరస్‌ ప్రభావంతో మహారాష్ట్రలోని షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఆలయాన్ని ట్రస్ట్‌ అధికారులు మూసివేస్తున్నారు. 

భక్తులు షిర్డీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని మూసివేశారు. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా మూసేశారు. 

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల ఆలయంలో శ్రీవారిని టైంస్లాట్‌ టోకెన్‌ ద్వారా తక్కువ సమయంలో దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలోని దుర్గ గుడి అధికారులు సహితం భక్తులను ఆలయానికి  రావద్దని సూచించింది. 

కాగా, భద్రాచలంలోని శ్రీరామచంద్రుడి ఆలయంలో శ్రీరామనవమికి జరిపే కళ్యాణంకు భక్తులను అనుమతించరాదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణహాయించింది. కేవలం పురోహితులు మాత్రమే సంప్రదాయరీతిలో కళ్యాణం జరుపుతారనై ప్రకటించింది. 

మహారాష్ట్రలో కరోనా వైరస్‌తో 68 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 135కు పెరిగింది. ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులు 39 నమోదు అయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. సినిమా హాల్స్‌, షాపింగ్‌ మాల్స్‌ను మూసివేశారు. అన్ని ఎన్నికలను కూడా వాయిదా వేశారు.