కరోనా కట్టడికి అష్టదిగ్బంధనం దిశగా భారత్ 

కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్‌ అష్టదిగ్బంధం దిశగా సాగుతున్నది. ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న వైరస్‌ భారత్‌లో విస్తరించకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటున్నది. భూ, జల, వాయు మార్గాలను దాదాపు మూసివేసింది. 

ఇప్పటికే అంతర్జాతీయ సరిహద్దుల్లో అత్యధిక శాతం మూసివేసింది. విదేశీ నౌకలన్నింటినీ తీరప్రాంతాల్లో నిలిపివేస్తూ జలమార్గాలపై ఆంక్షలు విధించింది. వాయుమార్గంలో ముప్పును ఎదుర్కొనేందుకు ఇప్పటికే వీసాలన్నింటినీ రద్దు చేసింది. విదేశీయుల రాకపై కఠిన ఆంక్షలు విధించింది. 

తాజాగా.. కరోనా ప్రభావిత దేశాల నుంచి భారతీయుల రాకపైనా నిషేధాన్ని విధించింది. మరోవైపు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, ఇతరత్రా జన సమ్మర్ధ ప్రదేశాలను మూసివేశారు. 

ఇప్పటికే పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించిన కేంద్రం.. సోమవారం ఈయూ, బ్రిటన్‌, టర్కీ దేశాలను చేర్చింది. ఆయా దేశాల నుంచి వచ్చే భారతీయులకూ ఎలాంటి మినహాయింపు లేదని ప్రభుత్వం తెలిపింది. ఆ దేశాల నుంచి ఒక్క విమానాన్నీ భారత్‌లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. 

ఇది ఈ నెల 31 వరకు అమల్లో ఉంటుందని చెప్పింది. దీంతో బ్రిటన్‌, టర్కీ, ఐరోపా దేశాలకు చెందిన పౌర విమానయాన సంస్థలు ఈ నెలాఖరు వరకు తమ సర్వీసులను భారత్‌కు నిలిపివేయనున్నాయి.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. 50 మందికి మించి హాజరయ్యే ఎలాంటి  కార్యక్రమాలను మార్చి 31 వరకు రాజధానిలో అనుమతించబోమని ప్రకటించారు. మరోవైపు, ఇరాన్‌లో చిక్కుకున్న మరో 53 మంది భారతీయులతో కూడిన నాలుగో బృందాన్ని ఎయిరిండియా విమానం సోమవారం ఢిల్లీకి తీసుకొచ్చింది. 

కొవిడ్‌ నేపథ్యంలో జవహార్‌ నవోదయ విద్యాలయాల్లో ముందస్తు వేసవి సెలవుల్ని ప్రకటించారు. మార్చి 21 నుంచి మే 25 వరకు ఈ సెలవులు కొనసాగనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.