కరోనా వైద్య పరీక్షలు తిరస్కరిస్తే జైలు శిక్ష   

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ పరీక్షలను తిరస్కరించినా, కరోనా వైరస్ రోగులను దాచటానికి ప్రయత్నించినా, సమాజంలో భయందోళనలు కలిగించేలా వదంతులను వ్యాప్తి చేసినా, అలాంటి వారికి జైలు శిక్ష విధించడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్కారు హెచ్చరికలు జారీ చేసింది. 

కరోనా వైరస్ రోగులను దాచడానికి ప్రయత్నించినా, వైద్యుల బృందాన్ని అడ్డుకున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖ మంత్రి జైప్రతాప్ సింగ్ హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి అంటువ్యాధుల చట్టంలోని సెక్షన్ 3 కింద అధికారులకు అధికారం కల్పించామని మంత్రి జైప్రతాప్ సింగ్ చెప్పారు. 

కరోనా లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించినా, ఆసుపత్రుల నుంచి పారిపోయినా, వైద్యుల బృందం తన విధిని నిర్వహించకుండా అడ్డుకున్న వారిని అంటువ్యాధుల చట్టం సెక్షన్ 3 ప్రకారం జైలుకు పంపిస్తామని మంత్రి పేర్కొన్నారు.

యూపీలో కరోనా వైరస్ ప్రబలకుండా అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని, 1200 కు పైగా పడకలను సిద్ధం చేశామని మంత్రి వివరించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో లక్నో, ఘజియాబాద్, నోయిడా, ఆగ్రాతోసహా రాష్ట్రంలోని 11 జిల్లాల్లో సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్ లు, క్లబ్ లు, స్విమ్మింగ్ పూల్స్ ను మూసివేశారు.