ఏపీ హైకోర్టులో అత్యవసర కేసులు మాత్రమే 

కరోనా (కోవిద్‌ 19) వైరస్‌ వ్యాప్తి తరుణంలో రెండు వారాలపాటు ముఖ్యమైన కేసుల్ని మాత్రమే విచారించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నిర్ణయించింది. చీఫ్‌జస్టిస్‌ జీకే మహేశ్వరి నేతృత్వంలో జడ్జీలంతా సోమవారం సమావేశం అయ్యారు. అనంతరం సుప్రీంకోర్టు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ పాల్గొన్నారు. 

సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు, ఫుల్‌కోర్టులో జడ్జీలిచ్చిన సూచనల మేరకు రెండు వారాలపాటు అత్యవసర కేసుల్ని మాత్రమే విచారిం చాలని హైకోర్టు నిర్ణయించింది. అత్యవసర కేసులు అనగా పిల్లలు, వద్ధులు, బిల్డింగ్స్‌ కూల్చివేత, బెయిళ్లు వంటి కేసుల్ని మాత్రమే విచారిస్తాయి. కోర్టులోకి కేసున్న లాయర్‌నే అనుమతి ఇస్తారు.

ఇతరు లాయర్లు కారిడార్లకే పరిమితం అవ్వాలి. పిటిషనర్లు లేను విధిగా వాడాలి. ఇప్పటికే స్టేలున్న కేసుల్లో ఆ ఉత్తర్వులు పొడిగింపునకు లాయర్లు మాత్రమే కోర్టుకు రావాలి. కోర్టు ధిక్కార కేసుల్లో అధికారులు, ఉద్యోగులు కోర్టుకు రావక్కర్లేదు. 

నిందితులు కోర్టుకు రావాలని కచ్చితమైన ఆర్డర్స్‌ కింది కోర్టులు ఇవ్వకూడదు. కోర్టుకు రాలేనని ఎవరైనా కోరితే పర్మిషన్‌ ఇవ్వాలి. వ్యక్తిగతంగా కేసుల్ని వాదించే వాళ్ల్లు కోర్టుకు రాలేకపోయినా ఆ కేసుల్లో వ్యతిరేకంగా ఆర్డర్స్‌ ఇవ్వకూడదు. కింది కోర్టులు బెయిల్స్‌, ముందస్తు బెయిల్స్‌, జైళ్లల్లో ఉన్న ఖైదీలకు సంబంధించిన కేసులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. 

రెండు వారాల్లోగా స్టే ముగిసే కేసుల్లో ఆ స్టే ఉత్తర్వుల పొడిగింపునకు ఆదేశాలు పొందాలి. ఈ విధానం బుధవారం నుంచి అమల్లోకి వస్తుంది. మంగళవారం యథావిథిగా కోర్టులు పూర్వపు పద్దతుల్లోనే పనిచేస్తాయి.