తెలంగాణ రజాకార్ల సమితిగా మారుతున్న టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ తెలంగాణ రజాకార్ల సమితిగా మారుతోందని, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రజాకార్ల వారసులుగా పోటీపడుతున్నాయని బిజెపి రాష్ట్ర అద్యక్షుడు డా. కె. లక్ష్మణ్‌ ఘాటైన వ్యాఖ్యలుచేశారు. మజ్లిస్‌తో పాటు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వేర్వేరు కాదని, అవన్నీ ఒకేగూటి పక్షులని మండిపడ్డారు. మజ్లిస్‌ కార్యాలయం ఉన్న దారుస్సలాం తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్థుల్ని ఖరారుచేస్తోందని ఆరోపించారు. అది కుట్రల కేంద్రంగా మారిందని ద్వజమేత్తారు.

గతంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసి పోటీచేసిన సంగతి ఉత్తమ్‌ మరచిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మజ్లిస్‌ పార్టీని పెంచిపోషించింది కాంగ్రెస్‌ కాదా? అని నిలదీశారు. .  టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎంఐఎంకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. వాటికి వోట్లు వేయడం ఎంఐఎంకు వేసినట్టేనని స్పష్టం చేసారు.

మజ్లిస్‌ పార్టీ మెప్పుకోసం కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోందని, టీఆర్‌ఎస్‌తో లోపాయికారీ ఒప్పందం ఉండటంతో బిజెపిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు.  ఎన్నికలయ్యాక టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ను కలిపేందుకు ఎంపీ అసదుద్దీన్‌ రాయబారానికి సిద్ధమవుతున్నారని స్పష్టం చేసారు. అయితే  తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెబుతూ వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయమని లక్ష్మణ్ ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఒక్కటేనంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చేస్తున్న ఆరోపణల్నితీవ్రంగా ఖండించారు. ఉత్తమ్‌ మాటలన్నీ ఉత్తరకుమార ప్రగల్భాలేనని ఎద్దేవా  చేసారు. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఓటమిపాలవుతున్న కాంగ్రెస్‌ కు  తెలంగాణలోనూ గెలిచే పరిస్థితి లేకపోవడంతో పీసీసీ అధ్యక్షుడు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. మోడికి, కేసీఆర్‌కు పోలికా? అని మండిపడ్డారు.

మోదీ రోజుకు 18 గంటలు దేశంకోసం పనిచేస్తుంటారని,  కేసీఆర్‌ 18 గంటలు ఫాంహౌస్‌లో ఉంటారని, రాహుల్‌గాంధీ ఎప్పుడు ఏ దేశంలో ఉంటారో తెలియదని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మూసీలో వేసినట్లే’ అంటూ ప్రజలను హెచ్చరించారు. చేసారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంటే పొత్తులెందుకో చెప్పాలని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీ 119 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని లక్ష్మణ్ సవాల్ సవాల్ చేసారు. ముస్లింల సమగ్రాభివ్రుద్దికి కేంద్రం వినూత్న పథకాలు, కార్యక్రమాలు అమలుచేస్తోందని వివరించారు. ముస్లిం మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకే ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు తీసుకొచ్చామని గుర్తు చేసారు.