తెలంగాణలో దూసుకుపోతున్న ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగం

దేశంలోనేగాక ఆసియా ఖండంలోనూ లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధన, తయారీల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ గత నాలుగేండ్లుగా అనేక కొత్త సంస్థలను ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలను కల్పిస్తుండటంతో విస్తరణ ప్రణాళికలతో ఫార్మా రంగం వర్ధిల్లుతున్నది.

గడిచిన నాలుగేండ్లలో తెలంగాణ లైఫ్‌సైన్సెస్‌లోకి రూ.10,000 కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. అత్యుత్తమ ప్రమాణాలతో రూపొందించిన టీఎస్‌ఐపాస్‌తో ఇప్పటిదాకా దాదాపు 700 పెట్టుబడి ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ఆర్‌అండ్‌డీకి చెందినవే 100కుపైగా ఉండటం గమనార్హం. ఈ పెట్టుబడులతో కొత్తగా 70,000 ఉద్యోగాలు లభించిన్నట్లు చెబుతున్నారు.

 నోవార్టీస్, బయోలాజికల్ ఈ, లారస్ ల్యాబ్స్, పల్స్ ఫార్మా వంటి కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. మరోవైపు ప్రపంచస్థాయి సంస్థల చూపంతా కూడా ఇప్పుడు ఇక్కడే నెలకొన్నది. ఇప్పటికే ఫెర్రింగ్ ఫార్మా, కేమో, జీఎస్‌కే, సిన్జెన్, ైస్లెబ్యాక్ ఫార్మా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి అనేక విదేశీ దిగ్గజాలు తెలంగాణకు వచ్చాయి. అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ వంటి స్థానిక దిగ్గజాలూ రాష్ట్రంలో ఉండనే ఉన్నాయి. దీంతో ఔషధ రంగంలో తెలంగాణ వాయు వేగంతో పరుగులు పెడుతున్నది.

నూతన పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, ఫార్మా రంగం ఎగుమతుల విషయంలోనూ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించింది. తెలంగాణ ఎగుమతుల్లో లైఫ్ సైన్సెస్ రంగం ఒక్కటే 36 శాతంతో సింహాభాగంలో ఉన్నది. జాతీయ సగటు 1.18 శాతం మాత్రమే. గత నాలుగు సంవత్సరాల్లో ఎగుమతుల విషయంలో సుమారు 2.41 శాతం వృద్ధిని తెలంగాణ అందుకున్నది. దేశ సగటుకి రెట్టింపుతో ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నది.