దేశంలో 118 మందికి కరోనా.. మహాలోనే 38

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు అధికమవుతున్నాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 118కి పెరిగింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో మహారాష్ట్రకు చెందినవే అధికంగా ఉన్నాయి. మహారాష్ట్రలో తాజాగా మరో నలుగురికి కరోనా సోకడంతో ఇప్పటి వరకు 38 కేసులు నమోదు అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

అలాగే ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్‌ బోర్డు సభ్యులు ప్రకటించారు. అధిక సంఖ్యలో భక్తులు సందర్శించుకునే ఆలయంగా ఈ దేవాలయం ప్రాచుర్యం పొందింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆలయం మూసివేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆలయ వైద్య ఆరోగ్య కేంద్రం తెరిచే ఉంటుందని తెలిపారు. 

కొత్త హెల్ప్‌లైన్ నంబర్లను కేంద్రం ప్రకటించింది.కరోనా వైరస్ గురించి ఎటువంటి సమాచారం కావాలన్నా 1075 నంబరుకు కాల్ చేసి తెలుసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. అదే విధంగా 1800-112-545 నంబరుకు ఫోన్ చేసినా కరోనా గురించి సమాచారం అందజేస్తామని తెలిపింది. 

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం అందరూ కలిసి పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ నంబర్లకు తోడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన హెల్ప్‌లైన్ నంబర్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయని, వాటికి ఫోన్ చేసినా కరోనా గురించిన సమాచారం తెలుసుకోవచ్చని పేర్కొంది.   

ఒడిశాలో సోమవారం తొలి కరోనా కేసు నమోదైంది. ఇటీవల ఇటలీ నుంచి రాష్ట్రానికి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఢిల్లీలోని జేఎన్‌యూ యూనివర్సిటీ విద్యార్థులను ఇంటికి వెళ్లాల్సిందిగా యూనివర్సిటీ అధికారులు సూచించారు. ఇరాన్‌ నుంచి 53 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చావారిని జైసల్మేర్‌లోని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. 

కరోనా వైరస్‌ సోకి మరణించినవారికి బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించనున్నట్లు సీఎం నితీష్ కుమార్   అసెంబ్లీలో తెలిపారు. సిఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఆ సొమ్మును ఇవ్వనున్నారు. కరోనా చికిత్స కోసం అయ్యే మొత్తం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. 

రాజకీయ, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలపై కూడా నిషేధం విధిస్తున్నామని, ఒకే చోట 50 మంది కంటే ఎక్కువ గుమిగూడటంపై కూడా నిషేధం విధిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ప్రకటించారు.  కాగా ప్రపంచ వ్యాప్తంగా 135 దేశాలలో 1,53,517 మంది కరోనా బారిన పడగా.. 5,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.