త్వరలోనే అందుబాటులోకి  ''వర్చువల్‌ కోర్టులు''  

కోవిడ్‌-19 మహమ్మారి రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతుండటంతో సుప్రీం కోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ''వర్చువల్‌ కోర్టులను'' అందుబాటులోకి తీసుకురానున్నట్టు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డివై.చంద్రచూడ్‌ తెలిపారు. వచ్చే వారం నుంచి న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసులను వాదించవచ్చునని చెప్పారు. 

''కోర్టులు అనారోగ్యాన్ని వ్యాప్తి చేసే ప్రదేశాలుగా ఉండకూడదన్నదే మా ఉద్దేశం..'' అని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ఇప్పటికే 143 దేశాలను చుట్టేసిన కరోనా వైరస్‌ కారణంగా... ప్రపంచ వ్యాప్తంగా 5 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో... ఇప్పటికే కోర్టు రూముల్లోకి పరిమిత సంఖ్యలో మాత్రమే లాయర్లు, వ్యాజ్యకారులు, పాత్రికేయులకు ప్రవేశం కల్పిస్తున్నారు. 

ఈరోజు సుప్రీం కోర్టు బయట థర్మల్‌ స్క్రీనింగ్‌ సైతం ఏర్పాటు చేయడంతో ప్రవేశ ద్వారాల వద్ద పెద్ద సంఖ్యలో క్యూలైన్లు కనిపించాయి. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని హైకోర్టులతోనూ చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే తరచూ సమీక్షిస్తున్నట్టు జస్టిస్‌ చంద్రచూడ్‌ వివరించారు. 

ఇకపై కేసులను డిజిటల్‌ రూపంలో ఫైల్‌ చేయడం, వర్చువల్‌ కోర్టుల ద్వారా విచారణ జరపడం తదితర చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఇందుకోసం న్యాయవాదులు, వ్యాజ్యకారులు, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కోర్టులకు సహకరించాల్సి ఉంటుందని చెప్పారు. 

కరోనా విషయమై ఇప్పటికే అపొల్లో, ఫోర్టిస్‌ ఆస్పత్రులకు చెందిన వైద్య నిపుణులను సుప్రీం కోర్టు సంప్రదించినట్టు పేర్కొన్నారు. కాగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడదంటూ ఈ నెల 5 న ప్రభుత్వం సూచించిన నేపధ్యంలో... ప్రస్తుతం అత్యవసర కేసులను మాత్రమే విచారించాలని సుప్రీం కోర్టు గతవారం నిర్ణయం తీసుకుంది.