కరోనా దెబ్బకు కళ తప్పిన హైదరాబాద్ 

కరోనా వైరస్‌ ప్రభావంతో హైద రాబాద్‌ నగరం కళ తప్పింది. ప్రభుత్వ ఆదేశాలతో విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, పార్కులు, బార్లు మూసివేశారు. ఆదివారం రోజుల్లో నిత్యం కళకళలాడే షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు జనంలేక బోసిపో యాయి. సికింద్రాబాద్‌, కోఠిలోని కొన్ని దుకాణాలను యజమానులు ఆదివారం స్వచ్చందంగానే మూసివేశారు. 

రద్దీగా ఉండే కోఠి, నాంపల్లి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, అమీర్‌పేట, కూకట్‌పల్లి, తదితర ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్‌ తగ్గింది. హైదరాబాద్‌ నగరంలోని పర్యాటక ప్రాంతాలు సాలార్జంగ్‌ మ్యూజియం, జూ పార్క్‌, గోల్కొండ, శిల్పారామం మూసివేశారు. 

చార్మినార్‌, ట్యాంక్‌బండ్‌, బిర్లా మందిరం, నెక్లెస్‌ రోడ్‌,హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో రద్దీ తగ్గింది. అశోక్‌ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో కోచింగ్‌ సెంటర్లు మూతపడ్డాయి. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 7వేల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్ధులు ఇళ్లకు బయల్దేరారు.  

రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చేశారు. చాలా చోట్ల సినిమా హాళ్లు నడిచాయి. ముందస్తు బుకింగ్ల కారణంగా నడిపామని, సోమవారం నుంచి పూర్తిగా మూసేస్తామని వాటి మేనేజ్మెంట్లు తెలిపాయి. 

 కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్తల కోసం సీఎం కేసీఆర్ ప్రకటించిన అంశాలను అమలు చేసేలా ప్రభుత్వ శాఖలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. విద్యా సంస్థలకు సెలవు, సినిమా హాళ్ల బంద్ తదితర నిర్ణయాలను అమలు చేస్తూ చీఫ్సెక్రెటరీ సోమేశ్కుమార్ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం: 

అన్ని రకాల విద్య సంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ఇవ్వాలి. ఇంటర్, టెన్త్, ఇతర అడ్మిషన్ టెస్టులు యధావిధిగా జరుగుతాయి. ఆ పరీక్షలకు హాజరయ్యే వారి కోసం హాస్టళ్లు, రెసిడెన్షియల్స్కూళ్లు పనిచేస్తాయి. ఈ నెల 21 వరకు సినిమా హాళ్లు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ లు, జూ పార్కులు, మ్యూజియంలు మూసి వేయాలి.

ఇప్పటికే ముహూర్తం ఖరారైన పెళ్లిళ్లు మినహా ఇతర కార్యక్రమాలేవీ పెట్టుకోకూడదు. ఈ నెల 31 వరకు జరిగే పెండ్లిళ్లకు కూడా 200 కంటే ఎక్కువ మంది రాకుండా చూసుకుంటే మంచిది. 31వ తేదీ తర్వాత నిర్వహించే ఏ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఫంక్షన్ హాళ్లు కొత్త బుకింగ్లు తీసుకోవద్దు. 

ఆర్టీసీ బస్టాండ్లలో, రైల్వే స్టేష్లన్లలో, మెట్రో స్టేషన్లలో గతంలో కంటే ఎక్కువ పరిశుభ్రత ఉండేలా ఆయా శాఖలతో పని చేయించాలి. పబ్లిక్ మీటింగ్ లు, సమ్మర్ క్యాంపులు వంటి ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడే ప్రొగ్రామ్లకు ఈ నెల 21 వరకు పర్మిషన్ ఇవ్వొద్దు. అన్ని రకాల స్పోర్ట్స్ ఫెసిలిటీస్, మెంబర్షిప్క్లబ్లు, బార్లు, పబ్లు కూడా ఇదే తేదీ వరకు మూసివేయాలిని ఆదేశాల్లో పేర్కొన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా క్లబ్బులు, పబ్బులు, బార్లు, టూరిజం బార్లు, ఏ4 లిక్కర్ షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్రూం లను ఈ నెల 21 వరకు మూసివేయాలని ఆదేశిస్తూ సీఎస్ మరో ఉత్తర్వు జారీ చేశారు.