ఏపీలో మరో ఏడు కరోనా కేసులు 

ఆంధ్ర ప్రదేశ్ లో  రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నాడు మరో ఏడుగురు కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఈ వ్యాధి లక్షణాలతో ప్రభుత్వాస్పత్రులకు వచ్చారు. స్థానిక ఎటి అగ్రహారంలో ఈ లక్షణాలతో ఆస్పత్రికి వచ్చిన ఒక యువకుడు వైద్యులు పరీశీలిస్తుండగా పారిపోయాడు. దీంతో అతనికోసం గాలిస్తున్నారు. 

వీరు గాక, చైనా నుండి ఇటీవలే ఎఎన్‌యుకు వచ్చిన ఒక విద్యార్థినికి. నేపాల్‌కు సందర్శనకు వెళ్లి వచ్చిన ఒక మహిళకు, అమెరికా నుండి వచ్చిన మరో వ్యక్తికూడా కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని ఆస్పత్రుల్లో చేర్చారు. 

కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలో ఒక గ్రామానికి చెందిన యువకుడు ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లి వచ్చారు. ఆయనకు కరోనా లక్షణాలు కన్పించడంతో ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ జిజిహెచ్‌లో కరోనా లక్షణాలతో ఇద్దరు చేరారు. 

ఇలా ఉండగా,  విజయవాడలోని సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో కరోనా వ్యాధి నిర్ధారణ కేంద్రం ఏర్పాటు చేశామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ తెలిపారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్లను జిల్లా నోడల్‌ ఆఫీసర్లుగా ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. 

''కరోనా విజంభణతో యావత్‌ ప్రపంచం వణికిపోతోంది. 136 దేశాలకు విస్తరించిన ఈ ప్రాణాంతక వైరస్‌ను అంటువ్యాధిగా పరిగణించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను 'ప్రపంచ ప్రాణాంతక వ్యాది'గా ప్రకటించింది. ప్రాంతాలు దాటిన కరోనా ప్రపంచాన్ని కమ్మేసిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.'' అని తెలిపారు. 

1897 అంటువ్యాధుల చట్టం ప్రకారం కరోనా నియంత్రణకు జిల్లా కలెక్టర్లు, మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్లకు అధికారాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు.