రోడ్డు ప్రమాదంలో ‘గీతం’ అధినేత మూర్తి మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం విశ్వవిద్యాలయం అధినేత, తెదేపా ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి కన్నుమూశారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఆయన కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని ఆంకరేజ్‌‌ సఫారీని సందర్శించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న వ్యాను ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ప్రమాద సమయంలో ఆయనతోపాటు కారులో ప్రయాణిస్తున్న వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వి.బి.ఆర్‌ చౌదరి మృతి చెందగా.. కడియాల వెంకటరత్నం(గాంధీ) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న తానా సభ్యులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ నెల 6వ తేదీన కాలిఫోర్నియా జరగనున్న గీతం పూర్వవిద్యార్థుల సమావేశంలో ఆయన ప్రసంగించాల్సి ఉంది.

ఎన్టీఆర్‌ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన మూర్తి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. టిడిపి నుంచి తొలుత 1989లో విశాఖపట్నం నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఉమా గజపతిరాజుపై గెలుపొందారు. 1998లో రాజముండ్రి నుండి పోటీ చేసి బిజెపి అభ్యర్ధిపై ఓటమి చెందారు. 1999లోనూ మరోసారి విశాఖపట్నం నుంచి గెలుపొందారు. తరువాత 2004 ఎన్నికల్లో నేదురుమల్లి జనార్థన్‌రెడ్డిపై ఓడిపోయారు.

2009 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం సీటును పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించడంతో పోటీ చేయలేకపోయారు. అయితే మూర్తి సేవలను గుర్తించిన పార్టీ అధినేత చంద్రబాబు ఆయన్ని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేశారు. బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఆయనకు వియ్యంకుడు.

ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మృతి పట్ల సీఎం  చంద్రబాబునాయుడు  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేశారు. విద్యావేత్తగా, విద్యాదాతగా ఆయన ప్రజల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. గీతం సంస్థను స్థాపించి వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. విద్య, రాజకీయ రంగాలకు మూర్తి లేని లోటు ఎవరూ తీర్చలేరని చంద్రబాబు చెప్పారు. ఆయన మృతి  టిడిపి, విశాఖ ప్రజలకు తీరని లోటని తెలిపారు. టిడిపి ముఖ్య నేతలందరూ రోడ్డు ప్రమాదాల్లోనే మృతిచెందడం తనను కలిచివేస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.