భైంసాలో అల్లర్లు చేసిన తుక్డేగాళ్ల సంగతేంటో తేలుస్తా

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో భైంసాలో అల్లర్లు చేసిన తుక్డేగాళ్ల సంగతేంటో తేలుస్తానని బిజెపి నూతన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. పసిపిల్లల్ని చేతిలో పట్టుకుని తమపై పెట్రోల్ పోసి చంపేస్తున్నారంటూ ఆడపడుచులు ఆర్తనాదాలు చేసే పరిస్థితి అక్కడ తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు. 

వాళ్లందరినీ పరామర్శించేందుకు భైంసా వస్తానని చెప్పారు. ఆ అల్లర్లలో నిలువ నీడ లేకుండా పోయి చెట్ల కింద బతుకుతున్న నిరుపేదల్ని, అక్రమ కేసులతో జైళ్లలో పెట్టిన తమ్ముళ్లను కలిసి అండగా ఉంటామని భరోసా ఇస్తానని తెలిపారు.  నమ్మిన సిద్ధాతం కోసం, ధర్మ రక్షణ కోసం తాను పోరాడుతానని, తాను రూటు మార్చేది ఉండదని, అడ్డదారులు తొక్కబోనని హామీ ఇచ్చారు. 

 కేసీఆర్ సర్కారు లాఠీ దెబ్బలకు ఎవరూ భయపడొద్దని, తాను అండగా ఉంటానని, ప్రాణత్యాగానికైనా సిద్ధపడి పోరాటం చేస్తానని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి ఘోరీ కడదామని, యువత కలిసి రావాలని పిలుపునిచ్చారు.  గత ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. 

కొండగట్టు బస్సు ప్రమాదంలో ప్రజలు మరణించినా, ఆర్టీసీ కార్మికులు ఆత్మత్యాగాలు చేసుకున్నా, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కనీసం స్పందించని మానవత్వం లేని సీఎం కేసీఆర్ అని మండిపడ్డారాయన.