ప్రపంచాన్ని కాపాడుతున్నామన్న ఆత్మసంతృప్తి  

కరోనా బాధితులకు చికిత్స అందించే క్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది ప్రతిక్షణం కోట్ల వైరస్‌ కణాల మధ్య తిరుగుతున్నారు. అహర్నిశలు శ్రమిస్తూ.. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రపంచానికి ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు.   తెలియని శత్రువుతో పోరాటం.. ప్రతి క్షణం భయం భయం.. అయినా తగ్గని ఆత్మైస్థెర్యం.. కుటుంబానికి దూరం.. పైగా పని ఒత్తిడి.. అయినా ఆత్మసంతృప్తి.

ఎన్ని అడ్డంకులున్నా వైద్యసిబ్బందిలో ఆవగింజంత అసంతృప్తి కనిపించడం లేదు. పైగా ప్రపంచాన్ని కాపాడుతున్నామన్న ఆత్మసంతృప్తి వారిలో కనిపిస్తున్నది. ‘యుద్ధమొస్తే సైనికులు రక్షిస్తారు. ఇలాంటి మహమ్మారులు విజృంభించినప్పుడు కాపాడటం మా ధర్మం’ అని సగర్వంగా చెప్తున్నారు. రోగి కోలుకొని ఇంటికెళ్తుంటే వారి మొహాల్లో వెలకట్టలేని ఆనందం కనిపిస్తున్నది. చైనాలో 78,800 మందికి కరోనా సోకితే అందులో వైద్యసిబ్బందే 3,300 మందికిపైగా ఉండటం గమనార్హం. 

కరోనా సోకిన రోగులు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారో.. వారికి చికిత్స అందించే వైద్య సిబ్బంది అంతకన్నా ఎక్కువ బాధను అనుభవిస్తున్నారు. సిబ్బంది ఒక్కసారి ప్రొటెక్షన్‌ సూట్‌ వేసుకొని రంగంలోకి దిగితే ఇక తిండి ఎప్పుడు తింటారో.. డ్యూటీ ఎప్పుడు అయిపోతదో వాళ్లకే తెలియదు.  చికిత్స అందించే క్రమంలో పొరపాటున రోగి నుంచి వైరస్‌ సోకితే ఇక అంతే సంగతులు. 

సిబ్బంది ఇంటికి వెళ్లాక కుటుంబసభ్యులకూ వైరస్‌ అంటుకుంటుంది. కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో కేవలం చైనాలోనే 3,387 మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్‌ సోకింది. పది మందికిపైగా చనిపోయారు.   

‘నాకు తెలియని శత్రువుతో పోరాడుతున్నా’.. ఇటలీకి చెందిన నర్సు పాగ్లియారిని అన్న ఈ మాట అక్షరాలా నిజం. ఆమె 15 రోజులుగా ఇంటి ముఖం చూడలేదట. పనితో తీవ్రంగా అలసిపోయిన ఆమె.. కూర్చున్న చోటనే పడిపోయారు. ఆ ఫొటో నెటిజన్లను కదిలిస్తున్నది. కొన్ని చోట్ల వైద్య సిబ్బంది నీళ్లు తాగాలన్నా, టాయిలెట్‌కు వెళ్లాలన్నా ఆరు గంటలు వేచిచూడాల్సి వస్తున్నది. 

కరోనా రోగులకు వైద్యం అందించడమంటే కత్తిమీద సామువంటిది. చికిత్స అందించే క్రమంలో వైరస్‌ తమకు సోకకుండా వైద్య సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఓడిపోతున్నారు. కొందరికి నేరుగా వైరస్‌ సోకుతుంటే.. మరికొందరు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారు. 

క్వారంటైన్‌ ప్రాంతాల్లో రోజులపాటు విధుల్లోనే ఉండాల్సి వస్తున్నది. దీంతో అనారోగ్యం బారినపడుతున్నారు.  కుటుంబానికి దూరంగా ఉండటంతో కుంగుబాటుకు గురవుతున్నారు.

చైనాలో పెంగ్‌ వువ్వా అనే యువ డాక్టరు గత నెల 1న పెండ్లి చేసుకోవాలనుకున్నాడు. కరోనా విజృంభించడంతో రోగులకు వైద్యం అందించడానికి పెండ్లిని వాయిదా వేసుకున్నాడు. చికిత్స అందించే క్రమంలో అతడికి వైరస్‌ సోకింది. దీంతో అతడు గత నెల 21న మరణించాడు.