సార్క్ దేశాల కొవిడ్‌-19 ఎమర్జెన్సీ ఫండ్‌   

కరోనా మహమ్మారిపై సార్క్‌ కూటమి దేశాలు కలిసి పోరాటం సాగించాలని పిలుపిచ్చింది ప్రధాని నరేంద్రమోదీ  వైరస్‌ కట్టడికి ‘ఎమర్జెన్సీ ఫండ్‌' ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇందుకోసం భారత్‌ మొదటగా 10 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.74 కోట్లు) అందజేయనున్నట్లు చెప్పారు. 

వైరస్‌పై పోరుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు సార్క్‌ దేశాధినేతలతో ఆదివారం ప్రధాని జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌ లో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స, మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్‌ సోలీ, నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ, భూటాన్‌ ప్రధాని లోటే షెరింగ్‌, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, ఆప్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ, పాక్‌ ప్రధాని స్పెషల్‌ అసిస్టెంట్‌ జాఫర్‌ మీర్జా పాల్గొన్నారు. 

‘కొవిడ్‌-19 ఎమర్జెన్సీ ఫండ్‌ ఏర్పాటు చేయాలని నేను ప్రతిపాదిస్తున్నా. దీనికి సభ్యదేశాలన్నీ స్వచ్ఛందంగా నిధులు అందించవచ్చు. ఈ నిధికి భారత్‌ మొదటగా రూ.74 కోట్లు అందజేస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.

‘డాక్టర్లు, నిపుణులతో మేం ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను ఏర్పాటుచేస్తున్నాం. వీరు ‘స్టాండ్‌ బై’గా ఉంటారు. అవసరమైతే, మీకు పంపుతాం’ అని సార్క్‌ దేశాధినేతలకు తెలిపారు. వైరస్‌ బాధితులతోపాటు వారు కలిసిన వ్యక్తులను గుర్తించేందుకు భారత్‌ ‘ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైవలెన్స్‌ పోర్టల్‌'ను రూపొందించిందని, ఈ సాఫ్ట్‌వేర్‌ను సభ్యదేశాలకు భారత్‌ అందజేస్తుందని చెప్పారు.