సన్నద్ధులవండి, ఆందోళన వద్దు

‘‘సన్నద్ధులవండి, కానీ ఆందోళన చెందకండి’’ అంటూ సార్క్‌లోని ఇతర దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమిష్టిగా కరోనా వైరస్ ను ఎదుర్కొందామంటూ పిలుపిచ్చారు. 

కరోనా వైరస్‌(కోవిడ్‌-19)పై పోరాడేందుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు సార్క్‌ కూటమి దేశాధినేతలు ఇవాళ సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. భారత్‌ తరఫున ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణ చర్యలపై సభ్య దేశాలతో చర్చించారు. 

కరోనాపై ఉమ్మడి పోరాటం చేయాలని సార్క్‌ దేశాలకు మోదీ పిలుపునిచ్చారు.  దక్షిణాసియా ప్రాంతంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 150 కన్నా తక్కువే  అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.   కరోనా వ్యాప్తిపై  ఎవరూ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..నియంత్రణ చర్యలే ఉపయోగపడతాయని తెలిపారు.  వైద్య సిబ్బందికి శిక్షణతో సహా వ్యవస్థలను వేగంగా మెరుగుపరిచేందుకు కృషి చేసినట్లు చెప్పారు. 

ప్రపంచ జనాభాలో ఐదో వంతు ప్రజలు ఈ ప్రాంతంలోనే ఉన్నారని, కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, అయితే ఆందోళన చెందవద్దని ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలకు పెను సవాళ్ళు ఎదురవుతున్నాయని, అందువల్ల మనమంతా కలిసికట్టుగా సన్నద్ధమవాలని, సమైక్యంగా పని చేయాలని, కలిసికట్టుగా విజయవంతం కావాలని పిలుపునిచ్చారు. 

భయాందోళన లేకుండా జాగ్రత్తవహించి, కరోనా వైరస్‌‌ను ఎదుర్కొనేందుకు భారత దేశంలో వైద్యపరమైన మౌలిక సదుపాయాలను వేగంగా మెరుగుపరచినట్లు మోదీ తెలిపారు. పరిస్థితిని ముందుగానే నియంత్రించే చర్యలను చేపట్టేందుకు ప్రయత్నించామన్నారు. స్పందించే యంత్రాంగాలను మెరుగుపరచామని వివరించారు. 

'గత జనవరి నుంచి విదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారిని స్క్రీనింగ్‌ చేయడం ప్రారంభించాం. ఆ తర్వాత క్రమంగా ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తూ వచ్చాం. పలు దేశాల్లో ఉంటున్న  సుమారు 1400  మంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చాం. కరోనా వైరస్‌ ప్రభావిత దేశాల్లో చిక్కుకున్న సరిహద్దు దేశాల పౌరులను కూడా తీసుకొచ్చాం.  కరోనా వైరస్‌ నియంత్రణకు ముందస్తు జాగ్రత్త చర్యలే ముఖ్యమని' మోదీ పేర్కొన్నారు.