ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మె‍ల్యేలు రాజీనామా

రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. గుజరాత్‌లో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలను ఆదివారం అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్రత్రివేదికి సమర్పించారు. 

గుజరాత్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు మార్చి 26న ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల పేర్లను సోమవారం ప్రకటిస్తామని స్పీకర్‌ రాజేంద్రత్రివేది తెలిపారు. కాగా కాంగ్రెస్‌ కీలకంగా భావిస్తున్న రాజ్యసభ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.

రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకునేందుకు అధికార బీజేపీ కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్‌ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 73నుంచి 68కి చేరింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 సభ్యులకు గాను బీజేపీకి 103 మంది సభ్యుల మద్దతుంది. 

అయితే ఎన్నికలు జరిగే నాలుగు స్థానాలను రెండు పార్టీల సంఖ్యాబలాలను బట్టి కాంగ్రెస్‌, బీజేపీ చెరి రెండు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. అయితే మూడో స్థానాన్ని కూడా సొంతం చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.

ఈ క్రమంలోనే 111 మంది సభ్యుల మద్దతును కూడగట్టుకునే పనిలో ఆ రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైంది. మరోవైపు రెండు స్థానాలను దక్కించుకోవాలంటే విపక్ష కాంగ్రెస్‌కు 74 మంది సభ్యుల మద్దతు అవసరం కానుంది. తాజాగా నలుగురు  ఎమ్మెల్యేల రాజీనామాతో కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. 

అయితే ఎన్నికలకు మరికొంత సమయం ఉన్నందును వారిని తిరిగి తమవైపుకు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు మొదలుపెట్టారు. మరోవైపు మిగిలిన ఎమ్మెల్యేలను జైపూర్‌ తరలించేందుకు రంగం సిద్ధం చేశారు.