దేశాన్ని పరిశుభ్రంగా మారుస్తున్న యోధులు ప్రజలే

భారత ప్రజలు దేశాన్ని పరిశుభ్రంగా మారుస్తున్న యోధులు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ను విజయవంతం చేయడంలో ప్రజల పాత్ర ఎంతో ఉందని ఆయన కొనియాడారు. ఢిల్లీలో నాలుగు రోజులపాటు జరిగిన మహాత్మాగాంధీ అంతర్జాతీయ శానిటేషన్‌ కన్వెన్షన్‌ ముగింపు సభలో ప్రసంగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశంలో ప్రపంచ దేశాల నుంచి శానిటేషన్‌ మంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. సమావేశంలో మోదీ మాట్లాడుతూ భారత్‌లో గత నాలుగేళ్లలో 5లక్షలకు పైగా గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనను నిర్మూలించినట్లు చెప్పారు. 25 రాష్ట్రాలు బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రాలుగా ప్రకటించుకున్నాయని తెలిపారు.

స్వచ్ఛ భారత్‌ మిషన్‌తో దేశంలో ఉద్యమం లాంటి వాతావరణం ఏర్పడిందని, ఇది ప్రజల వైఖరిని మార్చిందని మోదీ వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, కొన్ని దేశాలు కలిసి శుభ్రత గురించి మాట్లాడుకుంటున్నాయని, ఇది కీలక మైలురాయి అని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు 4 అంశాలు అవసరమని అంటూ అవి రాజకీయ నాయకత్వం, ప్రజా నిధులు, భాగస్వామ్యం, ప్రజల పాత్ర అని వివరించారు.

ఎన్నో దేశాలు స్వచ్ఛత ఉద్యమంలో వచ్చి చేరుతున్నాయని.. అందరి తరఫున బాపూజీకి నివాళులర్పిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛభారత్‌ కోసం కృషి చేసిన కొందరిని మోదీ అవార్డులతో సత్కరించారు.

సమావేశంలో ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెర్రెస్‌ మాట్లాడుతూ పరిశుభ్రతకు ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చిన భారత ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నానని చెప్పారు.  స్వచ్ఛభారత్‌ మిషన్‌తో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించడమేనని పేర్కొన్నారు. పరిశుభ్ర భారత దేశమే గాంధీజీకి అందించే నిజమైన నివాళి అని వెల్లడించారు. ఏ దేశమైనా ప్రగతి దిశగా ముందుకెళ్లాలంటే తొలుత ఆ దేశం పరిశుభ్రతను సాధించాలని సూచించారు. గుటెర్రెస్‌ మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో ఉన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన‌ రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులర్పించారు.