ఎపిలో స్థానిక సంస్థ‌ల‌ ఎన్నిక‌ల వాయిదా... జగన్ అసహనం 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో స్థానిక‌ ఎన్నిక‌ల ప్రక్రియ వాయిదా ప‌డింది. క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్న కార‌ణంగా ఎన్నిక‌లను ఆరు వారాల‌పాటు వాయిదా వేస్తున్న‌ట్టు ఆదివారం ఎపి ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ర‌మేష్ కుమార్ ప్ర‌క‌టించారు. పైగా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడవలు, అవకతవకలపై స్పందించిన ఎన్నికల కమిషన్‌ పలువురి ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంది.  అందిన ఫిర్యాదుల మేరకు పలువురి అధికారులను సస్పెండ్‌ చేస్తూ పలువురిని బదిలీ చేస్తూ నిర్ణయం వెలువరించింది.

దానితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసేముందు ఎవరినైనా అడిగారా?.. చంద్రబాబు పదవి ఇచ్చినంత మాత్రాన ఇంత వివక్షా?  అని మీడియా సమావేశంలో సీఎం జగన్‌ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. పైగా చంద్రబాబు సామజిక వర్గానికి చెందిన ఈసీ రమేష్‌ కుమార్‌ విచక్షణ కోల్పోయారని ధ్వజమెత్తారు. 

అధికారులను బదిలీ చేసే అధికారం ఈసీకి ఎక్కడిది. అధికారం 151 సీట్లున్న జగన్‌దా..? ఈసీదా..? ఇష్టం వచ్చినట్లు ఎన్నికలను వాయిదా వేస్తారా? ఎస్పీలను మార్చుతారు, కలెక్టర్లను మార్చుతారు. ఇండ్ల పట్టాలు ఇవ్వొద్దంటారు. ఇక సీఎంలు ఎందుకు..? ప్రభుత్వాలు ఎందుకు..? అన్ని ఈసీయే చేసుకోవచ్చుగా. అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

ఎన్నికల వాయిదా ఆర్డర్‌ తయారవుతున్నట్లు ఈసీ సెక్రటరీకి కూడా తెలియదు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం ఎవరినైనా అడగాలి కదా? కాగా,  చిత్తూరు జిల్లా, గుంటూరు జిల్లా కలెక్టర్లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ అదేవిధంగా ఇరు జిల్లాల ఎస్పీలను బదిలీ చేయాలని ఆదేశాలు జారీచేసింది. 

గుంటూరు జిల్లా మాచర్ల సీఐను సస్పెండ్‌ చేసిన ఈసీ శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలపై, తిరుపతి, రాయదుర్గం, తాడిపత్రి సీఐలపై బదిలీ వేటు వేసింది. తిరుపతి, మాచర్ల, పుంగనూరులో అవసరం అయితే కొత్త షెడ్యూల్‌ విడుదల చేస్తామని ఈ అంశం పరిశీలనలో ఉందని ఈసీ పేర్కొంది.  

దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యా‌ప్తిచెందుతున్న కార‌ణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు, ప్ర‌జా ఆరోగ్యం దృష్ట్యా ఎన్నిక‌లు వాయిదా వేసిన‌ట్లు ఇసి తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌క్రియ ర‌ద్దు కాద‌ని, ఏక‌గ్రీవంగా ఎన్నికైన వారు కొన‌సాగుతార‌ని స్ప‌ష్టం చేశారు. అత్యున్న‌త స‌మీక్ష త‌ర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు. 

కొన్ని చోట్ల ప‌లువురు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని, ఇందులో భాగంగా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరించిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇసి వెల్లడించారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘర్షణలను కమిషనర్ తప్పుబట్టారు. గుంటూరు, చిత్తూరులో జరిగిన అత్యంత హింసాత్మక ఘటనలు తమ దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలపై బదిలీ వేటుకు సిఫారసు చేశారు. 

తిరుపతి, మాచర్ల, పుంగనూరులో ఘర్షణలపై విచారణకు హెచ్చరించారు. మహిళలు, బలహీనవర్గాలపై దాడులు అత్యంత శోచనీయమన ఇవిచారం వ్యక్తం చేశారు. వలంటీర్లపై ఆరోణల ఆదేశించారు. ఆ మూడు చోట్ల కొత్త షెడ్యూల్‌కు వెనకాడబోమని విషయంలో కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.