చంద్రబాబు ప్రతిపక్ష నాయకత్వ హోదాపై జగన్ గురి! 

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక నాయకుడిగా గల హోదాపై ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురి పెట్టిన్నట్లు స్పష్టం అవుతున్నది.  మొదట్లో ఎన్నికైన వారెవరైనా సరే  పార్టీలో చేరాలి అంటే తమ పదవులకు రాజీనామా చేసి రావాలని స్పష్టం చేసిన జగన్ ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి, కేవలం అసెంబ్లీలో టిడిపి ఉనికిని ప్రశ్నార్ధకరం చేయడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 

గత కొద్దీ రోజులుగా వివిధ జిల్లాల్లో ప్రముఖ టిడిపి నాయకులు, మాజీ ఎమ్యెల్యేలు వరుసగా టిడిపిలో చేరుతూ  ఉండగా,ఇప్పుడు ఎమ్యెల్యేలపై దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ముగ్గురు ఎమ్యెల్యేలు అధికారం పక్షంలో చేరారు. వల్లభనేని వంశి, మద్దాలి గిరి, కరణం బలరాం లు పార్టీ వదలి వెళ్లిపోయారు.

కనీసం మరో పది మంది ఎమ్యెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అధికార పార్టీకి మద్దతుగా మరో పదిమంది ఎమ్మెల్యేలు చేరినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని వైసిపి సీనియర్‌ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొనడం గమనార్హం. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రతిపక్ష హోదా కూడా నిలుపు కునే అవకాశం ఉండకపోవచ్చని తేల్చి చెప్పారు.

వారిని కూడా చేర్చుకొని, టిడిపి  శాసనసభపక్షంలో చీలిక అంటూ వైసిపిలో వారు విలీనం చేసే విధంగా వ్యూహరచన చేసిన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహితంగా వ్యవహరిస్తూ, రాజకీయంగా ఆయన సలహాలను ఆచరిస్తున్న జగన్ ఈ విషయంలో సహితం ఆయననే మార్గదర్శిగా తీసుకొన్నట్లు స్పష్టం అవుతున్నది.   

తెలంగాణ లో ఏ విధంగా అయితే రెండింట మూడు వంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన తర్వాత టి ఆర్ ఎస్ లో చేరారో,  ఇక్కడ కూడా అదే విషంగా చేయడానికి సిద్దపడుతున్నారు. ప్రస్తుతం టిడిపికి 23 మంది సభ్యులు ఉన్నారు. వారిలో సగం మందికి పైగా వైసిపిలో చేరితో చంద్రబబు ప్రతిపక్ష నాయకుడి హోదాను కోల్పోతారు. దానితో ఆయన భద్రత, ఇతర విషయాలలో సహితం ప్రాధాన్యతను కోల్పోతారు. 

ఇప్పటికే శాసన మండలిని కూడా రద్దు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు సహితం ఏకపక్షంగా జరుగుతున్నాయి. నామినేషన్లు వేయడానికే సీనియర్ నేతలు టిడిపి సహితం భయపడుతున్నారు. ఇటువంటి పరిష్టితులలో ప్రతిపక్ష హోదాను సహితం చంద్రబాబు కోల్పోతే రాష్ట్రంలో టిడిపి ఉనికికే ఎసరు పెట్టిన్నట్లు కాగలదని జగన్ అంచనా వేస్తున్నారు.