కేంద్ర పర్యవేక్షణలో ఎన్నికలు జరగాలి

కేంద్ర ఎన్నికల కమిషన్‌ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ డిమాండ్‌ చేశారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ వర్కింగు జర్నలిస్టు ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యుజెఎఫ్‌) ఆధ్వర్యాన నిర్వహించిన మీట్‌ది మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ప్రజలు మూడు రాజధానులు అనగానే భయపడుతున్నారని, విజయనగరంలో కూడా అదే పరిస్థితి ఉందని తెలిపారు.

'విశాఖలో బిజెపి ఆఫీస్‌ పక్కన ఉన్న భూమిని బెదిరించి లాక్కున్నారని, విశాఖలో నా భూమినీ కబ్జా చేశారని' అని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. వైసిపి ప్రత్యామ్నాయ పార్టీగా బిజెపి, జనసేనను ప్రజలు ఆదరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిగా కొనసాగాలని తమ పార్టీ ఎకగ్రీవంగా తీర్మానం చేసిందని వివరించారు. 

నామినేషన్ల విషయంలో వైసిపి ఏకపక్షంగా వ్యవహరించిందని, ప్రతిపక్షపార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, బెదిరించడం, పత్రాలను చించేయడం వంటి చర్యలకు పాల్పడిందనిఆరోపించారు. అధికార పార్టీ ఆగడాలపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఏకగ్రీవాలు జరిగిన చోట్ల విచారణ జరిపించి మరలా ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.